
అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఇక తొలిరోజు అయోధ్య మందిరానికి భక్తులు భారీగా విరాళాలు అందజేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు, ఆన్‌లైన్ ద్వారా రూ.3.17 కోట్ల విరాళాలు వచ్చినట్లు రామమందిరం ట్రస్టు తెలిపింది. ఇందుకోసం 10 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా పేర్కొన్నారు.
కాగా రెండోరోజు సైతం భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. బుధవారం రాత్రి 10 గంటల వరకు 2.5 లక్షల మందికి దర్శనభాగ్యం కలిగినట్లు అధికారులు తెలిపారు. భక్తులు భారీగా తరలివస్తుండటంతో వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దర్శన సమయాలను పొడిగిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తొలుత దర్శన వేళలను ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కల్పించారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఈ సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మారుస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం అయోధ్యకు వచ్చే బస్సు సర్వీసులను, రైళ్లను సైతం తగ్గించింది. అయినప్పటికీ ప్రైవేట్ వాహనాల్లో అయోధ్యకు చేరుకుంటున్నారు.





