News

ఉగ్రపోరులో తుది విజయం సైనికులదే : రాజ్‌నాథ్‌ సింగ్‌

303views

ఉగ్రవాదులపై సాగిస్తున్న పోరులో సైనికులు పూర్తి విజయం సాధిస్తారనే సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. దేశ రక్షణ కోసం పాటుపడుతూనే ప్రజల హృదయాలనూ నెగ్గాల్సిన గురుతర బాధ్యత రక్షణ దళాల భుజస్కంధాలపై ఉందన్నారు. పూంఛ్‌లో ఇటీవలి ఉగ్రదాడి, ముగ్గురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడం వంటి పరిణామాల నేపథ్యంలో భద్రత పరిస్థితుల్ని సమీక్షించడానికి బుధవారం ఆయన జమ్మూకు వచ్చారు. రాజౌరీలో సైనిక బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రతి సైనికుడు మా కుటుంబమే

‘‘సైనికుల పరాక్రమంపై నాకు నమ్మకం ఉంది. ప్రతి సైనికుడు మా కుటుంబంలో భాగమే. వారి జీవితం విలువైనది. సైనికుడిపై ఎవరైనా కన్ను వేయడం మాకెంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందే. అనుక్షణం మీరు అప్రమత్తంగా ఉంటున్నా కొన్నిసార్లు ఉగ్రవాదులు మెరుపుదాడులకు పాల్పడుతున్నారు. అందువల్ల ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం మీకు బాసటగా నిలుస్తుంది. మీ సంక్షేమమే మాకు అమిత ప్రాధాన్యాంశం. ప్రజల హృదయాలను గాయపరిచే తప్పుల్ని మాత్రం నివారించండి. భారత సైన్యమంటే ఆషామాషీ కాదు. ఇంతకుముందు కంటే ఇప్పుడు సైన్యం చాలా బలమైనదని ప్రజలు నమ్ముతున్నారు. దేశానికి కాపలాదారులుగా ఉంటున్న మీరు ప్రజా సమస్యలను కూడా తెలుసుకుని వాటి పరిష్కారానికి తగినస్థాయిలో ప్రయత్నించాలి. వారి మనసులను గెలుచుకోవాలి. సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి. దానిని ధనరూపంలో కొలవలేం. ఆ లోటును ఎప్పటికీ భర్తీ చేయలేం’’ అని రాజ్‌నాథ్‌ చెప్పారు. ఇటీవలి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు పౌరుల కుటుంబసభ్యులతో ఆయన సమావేశమై వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పూంఛ్‌లో ప్రాణనష్టం తమకెంతో బాధ కలిగించిందన్నారు. ఆయన వెంట సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండే, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా ఉన్నారు. ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని రక్షణమంత్రి ఆరా తీశారు.