News

నత్తనడకన ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధి పనులు

330views

ఎడారి మతాలను అందలం ఎక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సనాతన ధర్మం దగ్గరికి వచ్చేసరికి కినుక వహిస్తోంది. ఇతర మతాల పైన పెట్టిన శ్రద్ధ హిందూ మతం, దేవాలయాలపై చూపించడం లేదు. దేవాలయాల ఆదాయమైతే వారికి కావాలి కానీ దేవాలయ అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేశారు. కడప ఒంటిమిట్ట కోదండ రామాలయం పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది.

ఒంటిమిట్ట పోతన గుట్టపై జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని 2022 మార్చి 9న రూ.50 లక్షలతో చేపట్టడానికి ఉన్నత స్థాయిలో అనుమతిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. అయినా ఇప్పటికీ పూర్తవ లేదు.

రైల్వేస్టేషన్‌కు వెళ్లే రహదారి నుంచి విద్యుత్తు ఉప కేంద్రం పక్కనే నర్వకాటిపల్లె పంచాయతీ ప్రజల రాకపోకలకు అనువుగా నూతనంగా రోడ్డు వేయాలని రూ.40 లక్షలను మంజూరు చేశారు. ఈ పనులు నిదానంగా సాగుతున్నాయి.

గతేడాది మార్చి నుంచి భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడానికి, ఇతర సౌకర్యాలకు తిరుమల-తిరుపతి దేవస్థానాల సివిల్‌ విభాగం సాంకేతిక నిపుణులు దశలవారీగా 17 పనులు చేపట్టడానికి రూ.4.75 కోట్లకు అనుమతిచ్చారు.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు ఎదురుగా ఉన్న పార్వేట మండపం నిర్మాణానికి రూ.17 లక్షలు, రామాలయం మాడ వీధుల పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు బయటికి వెళ్లేలా కాలువల నిర్మాణానికి రూ.50 లక్షలు, రామకోటి స్తూపం ఏర్పాటుకు రూ.3 లక్షలు మంజూరు చేశారు. పురావస్తుశాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ఇంకా చేపట్టలేదు.

కల్యాణ వేదిక ప్రాంగణంలో మురుగు కాలువల నిర్మాణానికి రూ.55 లక్షలు, నీరు నిల్వ చేయడానికి సంపునకు రూ.25 లక్షలు, కల్యాణ వేదికలో రంగులకు రూ.50 లక్షలు, యాత్రికుల వసతి విడిది భవనానికి సున్నం కొట్టడానికి రూ.10 లక్షలు, రామ, లక్ష్మణ తీర్థాల నవీకరణకు రూ.35 లక్షలు కేటాయించారు. అతిథి భవనంలో నూతన సొబగులు తీర్చిదిద్దడానికి రూ.కోటి ఇచ్చారు. బాగున్న వసతులను ధ్వంసం చేసి మళ్లీ ఆధునికీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావడంతో తాత్కాలికంగా ఆపేశారు.

ఇవేగాక మరికొన్ని పనులు కూడా మందగమనంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఈ పనులకు ఉన్నతాధికారులు అనుమతిచ్చినా, అప్పటిలోగా పూర్తయ్యేలా కనిపించడం లేదు.ఇప్పటికైనా రామాలయం అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.