News

శబరిమల భక్తులకు నీరు, అల్పాహారం అందించండి : కేరళ హైకోర్టు

251views

అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమల చేరుకుంటున్న భక్తులకు మార్గమధ్యంలో వారు విశ్రాంతి తీసుకుంటున్న ప్రాంతాల్లో తాగునీరు, అల్పాహారం అందించాలని కేరళ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు ట్రావన్‌కోర్‌ దేవస్థానం మండలి(టీడీబీ)కి, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసింది. శబరిమల వెళ్లే మార్గంలో తీవ్రమైన రద్దీ వల్ల భక్తులు, చిన్నారులు 12 గంటలకు పైగా రహదారులపై నిరీక్షించాల్సి వస్తోందని, ఆహారం అందక విలవిలలాడుతున్నారని వార్తా కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన జస్టిస్‌ అనిల్‌ కె.నరేంద్రన్‌, జస్టిస్‌ జి.గిరీశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ప్రత్యేక విచారణ నిర్వహించింది.

భక్తులు నిలిచిపోయి విశ్రాంతి తీసుకున్న చోట వారికి తాగునీరు, అల్పాహారం అందించడంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని టీడీబీని ఆదేశించింది. అన్నదానం ఏర్పాట్లు చేయకపోవడం, టాయిలెట్ల వసతిని కల్పించకపోవడం వంటి వైఫల్యాలను తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ల సంఖ్య 80వేలకు మించినప్పుడు భక్తుల రాకను ఎందుకు నియంత్రించలేదని పోలీసు అధికారులను ధర్మాసనం ప్రశ్నించింది. సన్నిధానం, పంబా వద్ద ఆయా ప్రాంతాల సామర్థ్యానికి మించి భక్తులు గుమిగూడకుండా కట్టడి చేయాల్సిందని అభిప్రాయపడింది.

ఆలయం వద్ద, పరిసరాల్లో భక్తుల రద్దీ ఏర్పడకుండా నియంత్రించాలని, మొత్తం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారికి ఉత్తర్వులిచ్చింది. శబరిమలలోని సన్నిధానం వద్ద కూడా గంటల తరబడి క్యూలలో నిరీక్షించాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం లక్షా 20 వేల మంది భక్తులు వచ్చారని, సోమవారం కూడా దాదాపు అంతే మొత్తంలో భక్తులు దర్శనానికి వచ్చారని టీడీబీ వర్గాలు వెల్లడించాయి.