News

పాక్ కటాసరాజ ఆలయంలో ‘దీపమాల’.. భారత్ నుంచి 55 మంది హాజరు

265views

భారతీయ సనాతన ధర్మం, తత్వశాస్త్రం మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక పుణ్యక్షేత్రాలు నేటి పాకిస్తాన్‌లో ఉన్నాయి. అటువంటి వాటిలో కటాసరాజ ఆలయ సముదాయం ఒకటి. ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ చక్వాల్ జిల్లాలో ఈ ఆలయం ఉంది. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఈ ఆలయం శిథిలావస్థకు చేరింది. అయితే ఇటీవలే భారత ప్రభుత్వం చొరవతో ఆలయ పునరుద్ధరణ పనులు జరిగాయి. ఇకపోతే, ఈ నెల 21, 22 తేదీల్లో ఆలయంలో దీపమాల ఉత్సవం నిర్వహించనున్నారు.

పాకిస్థాన్‌లోని హిందువులు ఈ ఉత్సవంలో విశేషంగా పాల్గొంటారు. ఈ ఉత్సవాలకు ఈసారి భారత్ నుంచి 55 మంది భక్తులు హాజరు కానున్నారు. వీరు ఇప్పటికే లాహోర్‌కు చేరుకున్నారు. ఈ మేరకు పాక్‌లోని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ తెలిపింది. ఈ బోర్డు ఆలయాల పరిరక్షణకు కృషి చేస్తోంది. వాఘా సరిహద్దు వద్ద భారతీయ యాత్రికుల బృందానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశామని బోర్డు అదనపు కార్యదర్శి రాణా సలీం తెలిపారు.

కటాసరాజ ఆలయ ప్రత్యేకత

దక్షయజ్ఞసమయంలో, సతీదేవి ప్రాయోప్రవేశం చేసినదన్న వార్త తెలిసినపుడు శివుని కంటి నుండి రెండు కన్నీటిబొట్లు రాలాయి. అవి భూమి మీద పడినపుడు, ఒకటి ఇక్కడి కటాసక్షేత్రంలోని అమృతకుండ్ తీర్థంగానూ, రెండవది భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని అజమేరు (అజ్మీర్) లోని పుష్కరరాజ్ తీర్థంగానూ మారాయి.17 దేవాలయాలతో కూడిన కటాస్‌రాజ్ ఆలయ సముదాయం హిందువులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ ప్రదేశం పురాణ కథలతో ముడిపడి ఉంది. ఈ సరస్సు చుట్టూ అనేక దేవాలయాలు ఉన్నాయి.

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృష్యవాణి పలికినది… ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉంది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. వీటినే, యక్షప్రశ్నలుగా హిందువులు చెప్పుకుంటూ ఉంటారు. ఇది కటాసక్షేత్రంలోని అమృతకుండ్ వద్దనే జరిగింది.