News

జ్ఞానవాపి వివాదం కేసులో అలహాబాద్‌ హైకోర్టు కీలక ఉత్తర్వులు

214views

వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో అలహాబాద్‌ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరించాలన్న అభ్యర్థనల అర్హతను సవాల్‌ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆలయ పునరుద్ధరణ కోరుతున్న పిటిషన్లపై విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. విచారణ కొనసాగించటానికి 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం అవరోధం కాబోదని అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ తన రూలింగ్‌లో పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలను యథాతథంగా కొనసాగించాలి. వాటి భౌతిక స్థితిలో ఎలాంటి మార్పులు చేయకూడదు. అయితే, ఆయా స్థలాల మత స్వభావాన్ని నిర్ణయించడాన్ని ఈ చట్టం నిషేధించలేదని జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ తెలిపారు. ఆ స్థలాల మత స్వభావాన్ని సాక్ష్యాల ఆధారంగా నిర్ణయించాల్సింది కోర్టులేనని స్పష్టం చేశారు. ‘జ్ఞానవాపి ప్రాంగణం హిందూ మత స్వభావాన్ని అయినా కలిగి ఉండాలి. లేదంటే ముస్లిం మత స్వభావాన్ని అయినా కలిగి ఉండాలి. అలాకాకుండా ఒకే సమయంలో రెండు మతాలను ప్రతిబింబించబోదు’ అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

ఈ అంశానికి జాతీయ ప్రాధాన్యం ఉన్నందున సత్వరమే విచారణ పూర్తిచేయాలని, సాధ్యమైనంత వరకు ఆరు నెలల్లో ముగించాలని వారణాసి కోర్టును న్యాయమూర్తి ఆదేశించారు. కాశీ విశ్వనాథ్‌ ఆలయంలోని కొంత భాగంలో గతంలో మసీదును నిర్మించారని, మళ్లీ ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిని వ్యతిరేకిస్తూ అంజుమన్‌ ఇంతెజామియా కమిటీ, ఉత్తర్‌ప్రదేశ్‌ సెంట్రల్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు వేసిన అయిదు పిటిషన్లను అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించింది. ఆలయ పునరుద్ధరణ కోరుతున్న పిటిషన్లను విచారించేందుకు వారణాసి కోర్టుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంలో తమ న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని మసీదు కమిటీ ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగం … సీల్‌ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా కార్బన్‌ డేటింగ్‌, ఇతర పద్ధతుల ద్వారా ఇటీవల శాస్త్రీయ సర్వే నిర్వహించింది.