ArticlesNews

బ్రిటిష్ వారికి ఒణుకు పుట్టించిన గేయ రచయత గరిమెళ్ళ సత్యనారాయణ

341views

( డిసెంబర్‌ 18 – గరిమెళ్ళ సత్యనారాయణ వర్థంతి )

‘మాకొద్దీ తెల్ల దొరతనం అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి… ‘దండాలు దండాలు భారత మాత’ అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి. దేశభక్తి కవితలు రాసి జైలుశిక్షను అనుభవించిన వారిలో ప్రప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి మారుపేరుగా నిలిచిన ఈయన రాసిన ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అనే పాట… ఆనాడు ప్రతి తెలుగువాడి నోటిలోనూ మార్మేగేది. ఈయనలాగా ప్రసిద్ధి చెందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.

గరిమెళ్ళ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలుక గోనెపాడు గ్రామంలో 14 జూలై 1893 న జన్మించాడు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. గరిమెళ్ళ ప్రాథమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో సాగింది. విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం మొదలైనచోట్ల పైచదువులు చదివాడు. బి.ఏ. చేశాక గంజాం కలెక్టర్‌ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. గరిమెళ్ళ చిన్నప్పుడే మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అతని స్వేచ్ఛాప్రియత్వం వల్ల ఎక్కువకాలం ఏ ఉద్యోగమూ చెయ్యలేకపోయాడు. 1920 డిసెంబర్‌లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయనిరాకరణ తీర్మానం అమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ ‘మా కొద్దీ తెల్లదొరతనం’ పాటను రాశాడు. 1921లో గరిమెళ్ళ ‘స్వరాజ్య గీతములు’ పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి.

గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నాడు. తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశాడు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. భోగరాజు పట్టాభిసీతారామయ్య ఆంగ్లంలో వ్రాసిన ‘ది ఎకనామిక్‌ కాంక్వెస్ట్‌ ఆఫ్‌ ఇండియా’ అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. గరిమెళ్ళ జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నాడు. అక్కడ గృహలక్ష్మి పత్రిక సంపాదకుడుగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా, వాహిని పత్రికలో సహాయ సంపాదకుడుగా చేరాడు. కొద్ది రోజులతర్వాత ఆంధ్రప్రభలో చేరాడు. కొంతకాలం ఆనందవాణికి సంపాదకుడుగా పనిచేశాడు. కొంతకాలం ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా జీవనం సాగించాడు.

గరిమెళ్ళ పేదరికం అనుభవిస్తున్న రోజుల్లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డాడు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతినెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి. చివరిదశలో ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యాచన మీద బ్రతికాడు. స్వాతంత్య్రానంతరం మన పాలకుల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దాంతో కొంతమంది మిత్రులు గరిమెళ్ళను ‘మాకొద్దీ నల్ల దొరతనం’ అనే గేయం రాయలని అడిగారట. దేశ భక్తుడు, స్వాతంత్య్ర పిపాసి అయిన గరిమెళ్ళ అందుకు అంగీకరించలేదు. చరమ దశలో దుర్భర దారిద్య్రాన్ని అనుభవించిన గరిమెళ్ళ 1952 డిసెంబర్‌ 18వ తేదీన మరణించాడు. ఆయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు జరిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం చంపుకున్న మరో స్వాతంత్ర్య యోధుడు, జాతీయ కవి గరిమెళ్ళ గారికి అశ్రునివాళి!