News

నేటి నుంచి నెల రోజులపాటు కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర ఉత్సవాలు

359views

సత్యం గల తల్లిగా, భక్తుల కొంగుబంగారుగా ఖ్యాతిగాంచిన కనకమహాలక్ష్మి అమ్మవారు మార్గశిర మాసోత్సవాలకు ముస్తాబయ్యారు.విశాఖపట్నంలో ఈనెల 13 నుంచి జనవరి 11 వరకు కొనసాగే ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనాలకు తరలిరానున్నారు. పాతనగరం బురుజుపేటలో వెలిసిన ఈ ఆలయానికి వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. పూర్వం విశాఖను పాలించిన రాజులు అమ్మవారిని ఇలవేల్పుగా కొలిచేవారు. వారి కోట బురుజు ఈ ప్రాంతంలో ఉండేదని, అందుకే దీనికి బురుజుపేట అనే పేరు వచ్చిందని చెబుతారు.

ఆలయం ప్రత్యేకత ఇదీ..

అమ్మవారిని పూజించడానికి వర్ణ, వర్గ వివక్షతలు ఉండకూడదని భావించిన పెద్దలు అప్పటిలో గుడి నిర్మాణాన్ని సైతం విరమించుకున్నారు. భక్తులు స్వయంగా పసుపు, కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి నివేదించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. అప్పుడే పుట్టిన పసిబిడ్డలు, కొత్త వాహనాలు, బంగారాన్ని మొదట కనకమహాలక్ష్మి వద్దకే తీసుకురావడం ఆనవాయితీగా మారింది. ఈ గుడికి రాజగోపురం అంటూ ఏమీ లేదు. గతంలో పలుమార్లు గోపురాన్ని నిర్మించడానికి ప్రయత్నించినా అవన్నీ విఫలమయ్యాయి. 24 గంటలూ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఈ ఆలయం ప్రత్యేకతగా చెప్పవచ్చు. మార్గశిర మాసంలో అమ్మవారి విగ్రహం వెలుగుచూడడం, ఈ మాసం మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైనది కావడంతో ఏటా మార్గశిర మాసంలో అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. గురువారం రోజున అర్ధరాత్రి 12.01గంటలకు కనకమహాలక్ష్మికి విశేష పంచామృతాభిషేకం చేసిన తర్వాత భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.

1917కు ముందు.. ఆ తర్వాత..

కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహం 1917 సంవత్సరానికి పూర్వం రోడ్డుమధ్యలో ఉండేది. 1917లో విగ్రహాన్ని అక్కడి నుంచి ఒక మూలకు జరిపారు. ఆ సమయంలో ప్లేగు వ్యాధి ప్రబలడంతో విశాఖ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్పుడు వందలాది మంది మృత్యువాత పడ్డారని చెబుతారు. ఇదంతా అమ్మవారి విగ్రహాన్ని కదిలించడం వల్లే జరిగిందని భావించిన ఆలయ నిర్వాహకులు తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించారు. ఆ తరువాత ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టింది. ఇదంతా కనకమహాలక్ష్మి మహిమేనని ప్రజలు విశ్వాసించారు. అప్పటి నుంచి విశాఖవాసులు అమ్మవారిని ఇలవేల్పుగా కొలుస్తున్నారు.

ఈ మాసంలో నిర్వహించే పూజలు : మార్గశిర మాసంలో ప్రతి రోజూ శ్రీచక్రనవర్ణార్చన, లక్ష్మీహోమం, విశేష కుంకుమ పూజలు, వేదపారాయణం, సప్తశతీ పారాయణం, మహావిద్య పారాయణం నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనం రూ.500, విశిష్ఠ దర్శనం రూ.200, శీఘ్ర దర్శనం రూ.100 టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉచిత దర్శనాలకు ఒక క్యూలైన్‌ ఏర్పాటు చేశారు.

ప్రతిరోజు వెయ్యి మందికి అన్నదానం : మార్గశిర మాసోత్సవాల్లో భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. టౌన్‌ కొత్తరోడ్డు నుంచి క్యూలైన్లు ఉంటాయి. దివ్యాంగులు, పిల్లల తల్లులు, వృద్ధులకు త్వరగా దర్శనమయ్యేలా చర్యలు తీసుకుంటాం. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తున్నాం. వివిధ ఆలయాల నుంచి 100 మంది సిబ్బందిని డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నాం. ప్రతి రోజూ వెయ్యి మందికి, గురువారం రోజున 5వేల మందికి అన్నదానం చేస్తామని ఆలయ ఈఓ కె.శిరీష తెలిపారు.