ArticlesNews

అన్నదానంతో సమత పంచిన కాశి నాయన

634views

( డిసెంబర్ 06 – కాశి నాయన వర్ధంతి )

శ్రేష్టమైన సద్గురు పరంపరలో భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ దీన జనసేవ, గోసేవ, శిథిలమైన దేవాలయాల జీర్ణోద్ధరణ చేస్తూ ఆజన్మాంతం ఆధ్యాత్మిక మార్గమే శరణ్యమని ఆచరణలో చూపిన మహనీయుడు కాశిరెడ్డి నాయన. నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లి గ్రామంలోని మునెల్లి వంశంలో మునెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులకు రెండవ సంతానంగా 1895 జనవరి 15న కాశిరెడ్డి నాయన జన్మించారు. అమావాస్యనాడు అర్ధరాత్రివేళ జన్మించిన కాశినాయన ప్రజలను అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానమార్గం వైపు మళ్లించిన ఒక దివ్య జ్యోతి నృసింహాపాసకులు.

కాశి నాయనకు చిన్నతనం నుండి కూడా దైవభక్తి ఎక్కువగా ఉండేది. వేమూరి రామయ్య గారి వద్ద కాశి నాయన విద్యాభ్యాసం చేశారు. సంస్కృత భాషలోని అమరకోశము మూడు కాండలు, నరసింహ శతకములోని పద్యాలు చక్కగా గురు ముఖత: కంఠస్థం చేసి, భారత, రామాయణ, భాగవతములను అవగాహన చేసుకున్నారు. రోజూ విష్ణు సహస్రనామ పారాయణం చేసేవారు. ఒకసారి వేపచెట్టు కింద కాశిరెడ్డి కూర్చొని ఉండగా, ఆయనకు అంతర్వాణి దిశా నిర్దేశం జరిగింది. సొంత ఊరు నుంచి ప్రకాశం జిల్లా వెలుగొండ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ అతిరాచ గురవయ్య స్వామిలో ఆయనకు సద్గురు సాక్షాత్కారం అయింది. గురవయ్య స్వామి శిష్యరికంలో మంత్రోపదేశం పొందారు. తన గమ్యమేమిటో అవగతం అయింది. గురువు సూచన మేరకు తీర్థ యాత్రలు ప్రారంభించారు. కన్యాకుమారి మొదలు కాశీ వరకూ దేశంలో కాశిరెడ్డి దర్శించని క్షేత్రం లేదు. కాశీలో మూడేళ్ళు గడిపారు. గరుడాద్రి వద్ద పన్నెండేళ్ళు తపస్సు చేశారు. తరువాత పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అన్నదానం, గోసేవ, ఆలయాల జీర్ణోద్ధరణకు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆశ్రమాలు నెలకొల్పారు. తటాకాలు, చెరువుల పూడిక తీయించి రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షించేవారు. నాయన వెళ్లిన ప్రతి చోటా అన్నదానం చేయించేవారు.

అమ్మ అన్నం ఆకలి అంటే మీకు ఆ స్థోమత లేకున్నా కనీసం గంజి అయినా పోయండి, పది మంది అన్నం ఒక్కరు తినకూడదు. నలుగురికి సరిపోయే అన్నం పది మంది పంచుకోవాలి అని కాశి నాయన అనేవారు. కడప జిల్లాలో గరుడాద్రి ఆశ్రమం, పోరుమామిళ్ల దగ్గర లింగమయ్య కొండ మీద లింగమయ్య కొండ ఆశ్రమం, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో యోగానందాశ్రమము, కోటగొట్లలోని గని క్షేత్రంలో గని ఆశ్రమం, గంగన్నపల్లి మెట్ల ఆశ్రమం, గిద్దలూరు తాలూకా పుల్వల చెరువు గ్రామంలో కాలువ బుగ్గ ఆశ్రమం, సీతారామపురం ఆశ్రమం, నెల్లూరు జిల్లాలో సీతారామపురం మండలంలో ఘటిక సిద్దేశ్వరం ఆశ్రమం, ఉదయగిరిలో లింగాలదొనలో అన్నదాన క్షేత్రములను నెలకొల్పారు. ఈ ఆశ్రమాలలో నేటికీ అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. అలాగే ఈ ఆశ్రమాలలో గోమాత ప్రాశస్త్యం తెలుపుతూ హైందవ ధర్మానుసారం గో సంరక్షణను చక్కగా నిర్వర్తించి గోమాత మహాత్మ్యమును వివరిస్తున్నారు.

కుల, మత, జాతి భేదం లేకుండా ఆర్తితో తమ వద్దకు వచ్చిన వారి కడుపు నింపి, అర్హతను బట్టి అనుగ్రహించి, దుర్మార్గులను సైతం సన్మార్గులుగా, సమర్థవంతంగా తీర్చిదిద్ది అవధూతగా వెలిసిన కాశి నాయన అందించిన సామాజిక సమరసతా సేవాస్ఫూర్తితో నేటికీ సుమారు 100 నిత్యాన్నదాన కేంద్రాలు నడుస్తున్నాయి. కడప జిల్లా నల్లమల అడవులకు చివరి గ్రామమైన కాశి నాయన మండలం వరికుంట్ల గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ జ్యోతి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో 1995 డిసెంబర్ 6వ తేదీన జ్యోతి క్షేత్రంలో జ్యోతిర్మయులుగా కాశి నాయన కాలం చెందారు. లేని వాడి కడుపు నింపడం నిజమైన మాధవ సేవ అని చెప్పిన గొప్ప అవధూత భగవాన్ శ్రీ కాశీ నాయన జీవితం సమరసతా కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నవారందరికీ ఆదర్శం.