
శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో నిర్వహించాల్సిన మహాకుంభాభిషేకం.. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన ఓ స్వామి సూచనతో వాయిదా పడుతోంది. ఈ క్రతువు ఇప్పుడు నిర్వహిస్తే ప్రభుత్వ అధినేతకు స్థానభ్రంశం కలుగుతుందంటూ ఆ స్వామి సెంటిమెంట్ ప్రయోగించి వాయిదా వేయించినట్లు సమాచారం.
శ్రీశైలంలో గత మే 25-31 వరకు మహారుద్ర శతచండీ సహిత వేద స్వాహాకారపూర్వక మహాకుంభాభిషేకానికి అంతకుముందే ముహూర్తం నిర్ణయించారు. దీనికి రూ.కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు రావాలని అధికారులు సీఎం జగన్‌ను కోరారు. అంతలోనే ఎండలను సాకుగా చూపి వాయిదా వేస్తున్నట్లు మే 21న ప్రకటించారు.
ఉత్తరాయణంలో చేయాల్సిన కార్యక్రమాన్ని దక్షిణాయనంలో ఎలా చేస్తారని అప్పట్లో చర్చ జరిగింది. అదే సమయంలో మే 12-17 వరకు విజయవాడలో నిర్వహించిన మహాయజ్ఞం కార్యక్రమంలో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదంటూ ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన ఓ స్వామి తొలుత కినుక వహించారు. అధికారులు ఆయన్ను ఒప్పించి, చివరి రోజున హాజరయ్యేలా చూశారు. తర్వాత శ్రీశైలంలో జరిగే క్రతువును ఆయన పర్యవేక్షణలోనే చేపట్టాలని నిర్ణయించగా, అలాగైతే తాము రాబోమని కీలక పీఠాధిపతులు ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమాన్ని వాయిదావేశారు.
మేలో మహాకుంభాభిషేకాన్ని వాయిదా వేయడంపై అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్.. హైకోర్టును ఆశ్రయించింది. పీఠాధిపతులు, పండితులను సంప్రదించిన దేవాదాయశాఖ.. కార్తిక మాసంలో నవంబరు 15-19 వరకు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు జులైలో హైకోర్టులో అఫిడవిట్ వేసింది. డిసెంబరు మొదటి వారం వచ్చినా, దీనిపై ఎవరూ నోరెత్తడంలేదు. ఈ తేదీల ఖరారుపై తనను సంప్రదించలేదని ఆ స్వామి అసంతృప్తితో ఉండటమే ఇందుకు కారణమని తెలిసింది.
దక్షిణాయనంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తే, అధినేతకు స్థానభ్రంశమని, త్వరలోనే ఎన్నికల దృష్ట్యా ఇది సరికాదని ఆయన ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు తెలిసింది. మరో పది రోజుల్లో కార్తిక మాసం ముగియనున్నందున, సంక్రాంతి తర్వాత ఉత్తరాయణంలో ఈ క్రతువు నిర్వహించవచ్చని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. స్వామికి, ఓ మంత్రికి మధ్య విభేదాల కారణంగా మల్లన్న మహాకుంభాభిషేకం వేడుక వివాదాస్పదమవుతోంది.





