
శిరిడీ సాయి బాబా టెంపుల్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలోని బంగారు, వెండి నిల్వలను కరిగించి నాణేలు తయారు చేసి భక్తులకు విక్రయించాలని నిర్ణయించింది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. శిరిడీ సాయి బాబాకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి సైతం వచ్చి భక్తులు బాబాను దర్శించుకుంటారు. ఈ సందర్భంగా శిరిడీ సాయికి భక్తులు భారీగా విరాళాలు, కానుకలు సమర్పిస్తుంటారు.
భక్తులు ఇప్పటి వరకు సమర్పించిన కానుకల్లో 450 కిలోల బంగారం, 6 వేల కిలోల వరకు వెండి హుండీల్లో వచ్చి చేరింది. ఈ క్రమంలో ఆలయానికి వచ్చిన కానుకల్లో 155 కిలోల బంగారం, 6 వేల కిలోల వెండి కరిగించి 5, 10 గ్రాముల నాణెలు, పతకాలను తయారు చేయించాలని నిర్ణయించినట్లు ట్రస్ట్ బోర్డు సభ్యులు తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరామని, అనుమతులు వస్తే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.





