News

2024 చివర్లోగా ఐఎస్‌ఎస్‌లోకి భారత వ్యోమగామి

185views

అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో భారత్‌కు సాయం చేయడానికి తాము సిద్ధమని అమెరికా రోదసి సంస్థ-నాసా అధిపతి బిల్‌ నెల్సన్‌ తెలిపారు. మన దేశంలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది చివర్లో భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్‌)కి పంపేందుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. అర్హత కలిగిన వ్యోమగామిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంపిక చేస్తుందన్నారు.

‘‘2040 నాటికి వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేసుకోవాలని భారత్‌ అనుకుంటోంది. దాని సాకారంలో మా భాగస్వామ్యాన్ని కోరితే.. సానుకూలంగా స్పందిస్తాం’’ అని తెలిపారు. అంతకుముందు ఆయన.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. అంతరిక్ష రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకునే అంశంపై చర్చ జరిగింది.

‘‘భారత వ్యోమగామిని రోదసిలోకి పంపేందుకు ఇస్రో ప్రయోగించే గగన్‌యాన్‌ మాడ్యూల్‌కు సంబంధించిన రక్షణ కవచాలను నాసా హైపర్‌వెలాసిటీ ఇంపాక్ట్‌ టెస్ట్‌ (హెచ్‌వీఐటీ) కేంద్రంలో పరీక్షించే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అని శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 2024లో ఐఎస్‌ఎస్‌లోకి భారత వ్యోమగామిని పంపుతామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన ప్రతిపాదనపై జితేంద్ర సింగ్‌, నెల్సన్‌లు తాజాగా చర్చించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నెల్సన్‌.. భారత్‌ను కోరారు.