
తిరువణ్ణామలైలో కార్తిక పున్నమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు సోమవారం గిరి ప్రదక్షిణకు పోటెత్తారు. ఆలయంలో స్వామివారి దర్శనానికి ఏడు గంటల సమయం పడుతోంది. వేలూరు, చెన్నై మార్గాలలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఆదివారం సాయంత్రం కొండపై మహాదీపం వెలిగించిన తర్వాత అర్ధరాత్రి పంచమూర్తులు ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు.
తొలుత మూషిక వాహనంపై విఘ్నేశ్వరుడు, నెమలిపై వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, అనంతరం ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామి బంగారు వృషభ వాహనంపై, పరాశక్తి అమ్మవారు వృషభ వాహనంపై, చండికేశ్వరర్ అధికార నంది వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 250 ప్రత్యేక బస్సులు నడిపింది. డిసెంబరు 6వ తేదీ వరకు మహాదీపాన్ని భక్తులు దర్శనం చేసుకోవచ్చు. డిసెంబరు 6వ తేదీ వరకు ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుందని, కావున ప్రత్యేక దర్శనం, సిట్టింగ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాధారణ దర్శనం మాత్రమే ఉంటుందని ప్రకటించారు.





