News

వైభవంగా అన్నవరం సత్యదేవుని, మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి తెప్పోత్సవాలు

251views

కార్తిక మాసం సందర్భంగా క్షీరద్వాదశిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురంలో లక్ష్మీచెన్నకేశవస్వామి వారికి, కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్లకు తెప్పోత్సవాన్ని చేపట్టారు

నాలుగు యుగాల దేవుడిగా ప్రాశస్త్యం పొందిన లక్ష్మీచెన్నకేశవస్వామి తెప్పోత్సవం మార్కాపురంలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా సాగింది. తొలుత లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానంలో శ్రీదేవి, భూదేవి సమేత రంగ నాయకస్వామిగా అలంకరించారు. అక్కడ నుంచి సంతాన వేణుగోపాల స్వామి గుడి వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయ పుష్కరణిలోకి తరలించి తెప్పపై ప్రతిష్ఠించారు. జై చెన్నకేశవ, జైజై చెన్నకేశవ అంటూ భక్తుల నమస్మరణతో పుష్కరణి పరిసరాలు మారుమోగాయి.

కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి తెప్పోత్సవం శుక్రవారం కనులపండువగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారు, క్షేత్ర రక్షకులు సీతారాములవారిని పల్లకీలో కొండపై నుంచి పంపా సరోవరం వద్దకు తీసుకువచ్చారు. వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన వేదికపై ఆశీనులు చేశారు. అనంతరం తులసీధాత్రి పూజ నిర్వహించారు. 6.30 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను హంసవాహనంపై పంపాలో ఊరేగించారు.