News

మరో ఆరు నెలలపాటు మణిపూర్‌లో ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం కొనసాగింపు

242views

ప్రస్తుత కల్లోల పరిస్థితుల నేపథ్యంలో మణిపూర్ రాష్ట్రంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను అక్టోబర్‌ 1 నుంచి ఆరు నెలల పాటు పొడిగిస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ అధికారిక ప్రకటన వెలువడింది.

మే మూడో తేదీ నుంచి జాతుల మధ్య వైరంతో మణిపుర్‌ అట్టుడికిన సమయంలో మైతేయ్‌ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారు. వారి మృతదేహాల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావటంతో మరోసారి ఆందోళనలు జరిగాయి. ఈ హత్యలను ఖండిస్తూ విద్యార్థులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం బీరెన్‌సింగ్‌ నివాసానికి సమీపంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. బాష్పవాయువు గోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.పొరుగు రాష్ట్రం అసోంతో సరిహద్దు కలిగిన ఇంఫాల్‌ లోయలోని 19 పోలీసు స్టేషన్లను ఈ చట్టం నుంచి మినహాయించినట్లు ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో మైతేయ్‌ వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక అధికారాల చట్టం నుంచి మినహాయించిన 19 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పోలీసుల అనుమతి లేకుండా సైన్యం, అసోం రైఫిల్స్‌ ఆ ప్రాంతాల్లో ప్రవేశించటానికి వీలుండదు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 6 నెలల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించింది.

సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో భద్రతా బలగాలకు విశేషాధికారాలు లభిస్తాయి.