
డిజిటల్ ఐడీ కార్డు ఆధార్ అత్యంత సురక్షితమైనదని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) పేర్కొంది. ఆధార్‌పై మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ చేసిన ఆరోపణలు నిరాధారం అని.. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఆధార్‌ను ప్రశంసించినట్లు యూఐడీఏఐ వెల్లడించింది.
ఆధార్ కార్డు సర్వీస్ సరిగా లేదని, వేడి వాతావరణంలో బయోమెట్రిక్ టెక్నాలజీ నమ్మదగినదిగా లేదని మూడీస్ సంస్థ ఆరోపించిన విషయ తెలిసిందే. అయితే ఎటువంటి సాక్ష్యాలు లేకుండానే ఆధార్ కార్డులపై ఇన్వెస్టర్ సంస్థ నిరాధార ఆరోపణలు చేసిందని, ప్రపంచంలోనే ఆధార్ కార్డు అత్యంత నమ్మకమైన డిజిటల్ ఐడీ అని, గత దశాబ్ధ కాలంలో వంద కోట్ల మంది భారతీయులు తమ గుర్తింపును ఆ కార్డుతో వెయ్యి కోట్ల సార్లు చూపించుకున్నట్లు యూఐడీఏఐ ఒక ప్రటకనలో పేర్కొంది.
మూడీస్ ఇచ్చిన డేటాతో తాము ఏకీభవించడం లేదని యూఐడీఏఐ పేర్కొన్నది. ఆధార్ డేటాబేస్‌లో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని ఇటీవల పార్లమెంట్‌లో కూడా పేర్కొన్నట్లు యూఐడీఏఐ తెలిపింది. అంతర్జాతీయ సెక్యూర్టీ, ప్రైవసీ ప్రమాణాల ప్రకారమే ఆధార్‌ను జారీ చేస్తున్నట్లు తెలిపారు.ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఆధార్ వ్యవస్థను మెచ్చుకున్నాయని యూఐడీఏఐ పేర్కొన్నది. అనేక దేశాలు ఆధార్ శైలిలో తమ ఐడీలను రూపొందించుకున్నట్లు యూఐడీఏఐ తెలిపింది.





