
ది ఫిషర్ మ్యాన్ సొసైటీ యూత్ ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో నిర్మించిన శిఖర, కలశ సహిత శ్రీ విజయ గణపతి స్వామి వారి దేవస్థానంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ట వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన హోమ పూజలు, శ్రీ విజయ గణపతి స్వామి వారి విగ్రహ ప్రతిష్ట పూజల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నానికు వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, ది ఫిషర్ మ్యాన్ సొసైటీ సభ్యులు ఆత్మీయ సత్కారం చేశారు. ఫిషర్ మ్యాన్ సొసైటీ యూత్ సభ్యులందరూ కలిసి, ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్న దైవ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం సంతోషకరమని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. శ్రీ విజయ గణపతి స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా, ప్రతి కుటుంబం విజయపథంలో నడవాలని ఆయన ఆకాంక్షించారు. స్థానిక భక్తుల విజ్ఞప్తి మేరకు, దేవస్థాన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే కొడాలి నానికు ఫిషర్ మ్యాన్ సొసైటీ పెద్దలు ధన్యవాదాలు తెలియజేశారు. విగ్రహా ప్రతిష్ట వేడుకల్లో భాగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదివేల మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ది ఫిషర్ మ్యాన్ సొసైటీ యూత్ సభ్యులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.





