
ఖలిస్థాన్ వేర్పాటువాది, వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు 3 వారాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో అధికారుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వారిస్ దే పంజాబ్ చీఫ్ దీప్ సిద్దూ మరణించాక ఐఎ్‌సఐ సూచనలతో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు అమృత్‌పాల్ పక్కా ప్లాన్‌తోనే దేశంలోకి వచ్చినట్లు తేలింది. ఆపరేషన్ బ్లూస్టార్‌కు కారణమైన ఖలిస్తాన్ ఉగ్రవాది జర్నైల్‌సింగ్ భింద్రన్‌వాలేలా కనిపించేందుకు ముందుగా అతడు కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలిసింది. అసోంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ అనుచరులు ఈ విషయం వెల్లడించారు. 2022 జూన్ 20 నుంచి 2 నెలలపాటు అమృత్‌పాల్ జార్జియాలోనే ఉన్నాడని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే అతడికి అక్కడ ఐఎ్‌సఐ ఆయుధాల శిక్షణ కూడా ఇచ్చిందని వివరించారు. ఇదిలా ఉండగా.. పరారీలో ఉన్న అమృత్‌పాల్ సోషల్ మీడియాలో కొద్దిరోజుల కింద పెట్టిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈనెల 14న బైశాఖీ సందర్భంగా సిక్కులతో సమావేశం ఏర్పాటు చేయాలని అకాల్ తక్త్ చీఫ్‌ను అతడు ఓ వీడియోలో కోరడంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటి వరకు పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేశారు.





