
శ్రీకాకుళం కాశీబుగ్గలో కొలువైన వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ఆవరణలో ఆర్యవైశ్య సంఘ నాయకుడికి క్షీరాభిషేకం చేయడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఆలయ ఆవరణలో ఇలా ఓ వ్యక్తికి పాలాభిషేకం చేయడం అపచారమని ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్తు అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. అమ్మవారి సన్నిధిలో ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని సూచించారు.
అసలేం జరిగిందంటే..
గతంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా కె.రమేష్ పని చేశారు. ఆ సమయంలో సంఘ నిధుల ఖర్చుల్లో వ్యత్యాసం ఉందని ఒక సభ్యుడు ఆరోపణలు చేశారు. వాస్తవం తేల్చేందుకుగానూ అప్పట్లోనే నిజ నిర్ధారణ కమిటీ వేశారు. ఆ కమిటీ సభ్యులు దస్త్రాలు పరిశీలించి ఆరోపణల్లో వాస్తవం లేదని 2019లోనే నిర్ధారించారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో రమేష్ సోదరుడు సంఘ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఈ ఈ క్రమంలో రమేష్‌కు కన్యకాపరమేశ్వరి ఆలయంలో పలువురు సంఘ ప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు. అయితే ఆలయ ఆవరణలో ఇలా ఓ వ్యక్తికి పాలాభిషేకం చేయడం అపచారమని పలువురు ఆక్షేపిస్తున్నారు. అమ్మ సన్నిధిలో ఇలాంటివి చేయడం విరుద్ధమని, దీన్ని అంతా ఖండించాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు.





