News

కోటి రూపాయలతో రామాలయం నిర్మాణం

224views

కడప జిల్లా పుల్లంపేట మండలంలోని టి.కమ్మపల్లెలో ఆ గ్రామ నాయకులు, కువైత్‌ ఎన్‌ఆర్‌ఐలు, ఆ గ్రామానికి చెందిన ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారందరూ కలిసి సుమారు రూ.కోటి పైబడి చందాలు వసూలు చేసి రామాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ నట్టిబొడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన శిల్పుల చేత దేవతా మూర్తుల విగ్రహాలను ఎంతో చక్కగా వేయించి ఈ ఆలయాన్ని నిర్మించారు. సీతాలక్ష్మణ, హనుమ సమేత రామచంద్రస్వామి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత పదేళ్లుగా టి.కమ్మపల్లె గ్రామానికి చెందిన కువైత్‌లోని ఎన్‌ఆర్‌ఐ యువకులు తాము సంపాదించిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఈ ఆలయం కోసం సమకూర్చుకున్నారు. మిగిలిన మొత్తాన్ని గ్రామానికి చెందిన ప్రజలు, ఈ గ్రామం నుంచి ఇతర గ్రామాల్లో వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్న వారు కూడా తమవంతు సహాయంగా ఆలయ నిర్మాణానికి సహకరించారు. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేది నుంచి8వ తేది వరకు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామ ప్రజలందరూ ఒక చోట చేరి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. 4న శనివారం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా యాగశాల ఏర్పాటు, దీక్షా హోమం, 5న ఆదివారం దీక్షా హోమం, సహస్రనామ కుంకుమార్చన, సుందరకాండ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహిస్తారు. 6న దీక్షా హోమం, పుష్పాదివాసం, బాలనాగమ్మ నాటకాన్ని ప్రదర్శిస్తారు. 7న మంగళవారం వేదపారాయణం, సహస్ర దీపాలంకరణ, విష్ణుసహస్ర నామ కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 8న సీతా, లక్ష్మణ, హనుమ సమేత రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రతిఒక్కరూ హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని విన్నవించారు.