News

నేత్రపర్వంగా శివయ్య ధ్వజారోహణం

263views

శ్రీకాళహస్తీశ్వరాలయ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన స్వామివారి ధ్వజారోహణం నేత్రపర్వంగా సాగింది. స్వామి అమ్మవార్ల మూలవిరాట్‌లకు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భేరి పూజతో మంత్రజలాలను ఆలయంలో చల్లుతూ శుద్ధి చేశారు. ఆలయంలోని అలంకారమండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం ఆదిదంపతుల ఊరేగింపు ఉదయం ఆలయం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి శివయ్య గోపురం, రాజగోపురం మీదుగా దేవాంగ వాహనాల వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చారు. అక్కడి నుంచి స్వామి, అమ్మవారు వెండి అంబారి వాహనంపై ఆశీనులయ్యారు. పరివార దేవతామూర్తులతో కలసి పార్వతీ పరమేశ్వరుల పురవిహారాన్ని దర్శించు కునేందుకు భక్తులు బారులు తీరారు. అనంతరం ధ్వజారోహణ మహోత్సవం నిర్వహించేందుకు స్వామివారి సన్నిధి ఎదురుగా ఉన్న స్వర్ణతాపడ ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను, పరివార దేవతలను కొలువు తీర్చారు. దర్భ, మామిడాకులు, ధవళ పతాకాన్ని ఆలయంలో ప్రదక్షిణ అనంతరం చతుర్మాడ వీధుల్లో కొలువైన నవసంధి వినాయకాలయాల వద్దకు పండితులు తీసుకువచ్చి పూజలు చేశాక ఆలయంలోకి చేర్చారు.స్వర్ణ తాపడ ధ్వజస్తంభానికి ధర్భధారణ చేశారు. మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య హోమం జరిగాక భక్తులు సమర్పించిన కొడి చీరలు, ధవళపతాకం, మామిడి ఆకులు ధ్వజస్తంభానికి ఎగురవేసి దేవతలకు ఆహ్వానం పలికారు.శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామి అమ్మవార్లు వెండి అంబారీపై పురవీధుల్లో ఊరేగారు. మూషిక వాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప అనుసరించారు. ఆలయ చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్‌బాబు, పాలకమండలి సభ్యులు, వేదపండితులు డాక్టర్‌ స్వా మినాథన్‌ గురుకుల్‌, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న మహతి భిక్షు అభినయం…
తెలుగు సినిమా వర్ధమాన హీరోయిన్‌ మహతి భిక్షు కూచిపూడి నృత్యప్రదర్శన సభికులను మంత్రముగ్ధులను చేసింది.శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ధూర్జటి కళాప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, నట శిక్షకురాలు అరుణ భిక్షు సారథ్యంలో ఆమె కుమార్తె మహతి భిక్షు తన బృంద సభ్యులైన అంజు అరవింద్‌,సురేంద్రనాథ్‌తో కలిసి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు.బో.. శంభో శివశంభో స్వయంభో అన్న కీర్తనకు మహతిభిక్షు లయబద్ధంగా నర్తిస్తూ ప్రదర్శించిన అభినయనం ఆహూతులను అబ్బురపరిచింది. నృత్య ప్రదర్శన అనంతరం ముక్కంటి ఆలయ అధికారులు ఘనంగా సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.