
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనకు మూడు రోజుల ముందు భారీఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. ఈ నెల 12న రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా నగరంలో ఢిల్లీ ముంబయి ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. అయితే.. ప్రస్తుతం పేలుడు పదార్థాలు లభించిన నేపథ్యంలో మోదీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని మోదీకి ముప్పు పొంచి ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో రాజస్థాన్ పోలీసులు పెట్రోల్ పోసుకుంటున్న సమయంలో దౌసా కలెక్టరేట్‌కు 500 మీటర్ల దూరంలో అనుమానాస్పద వాహనం కనిపించింది. వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. పోలీసు బృందం ఖాన్ భక్రి రోడ్డులో పికప్ వ్యాన్‌ను ఆపి చూడగా అందులో 10 క్వింటాళ్ల బరువున్న (10 quintals of explosives) 40 బస్తాల డిటోనేటర్లు, కనెక్టింగ్ వైర్లు, ఇతర వస్తువులు కనిపించాయి.
పేలుడు పదార్థాలను రవాణా చేసేందుకు డ్రైవర్ రాజేష్ మీనా వద్ద ఎలాంటి అనుమతి లేదని, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని మీనాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాని మోదీ రాకకు మూడు రోజుల ముందు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభించడంతో రాజస్థాన్ పోలీసులు అప్రమత్తమయ్యారు.





