ArticlesNews

విలువైన నిక్షేపాలు జమ్మూకశ్మీర్‌లో లభ్యం.. ఇక మన దేశం లిథియం వ్యాలీ అవుతుందా?

276views

భారత దేశంలో తొలిసారి అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖనిజాన్ని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారని తెలిపింది. ఇది నాన్ ఫెర్రస్ లోహం లిథియం అని, ఇది జమ్మూ-కశ్మీరులో ఉందని, దాదాపు 59 లక్షల టన్నుల వరకు ఉంటుందని వివరించింది.

కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. జియోలాజికల్‌ సర్వే ఆఫ్ ఇండియా మన దేశంలో మొట్టమొదటిసారి అత్యంత అరుదైన లిథియం నిక్షేపాలను గుర్తించింది. ఈ నిక్షేపాలు జమ్మూ-కశ్మీరులోని రియాసీ జిల్లా.. సలాల్-హైమన ప్రాంతంలో ఉన్నాయి. లిథియం, బంగారం సహా 51 ఖనిజాల క్షేత్రాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్లు ఈ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో ఐదు బ్లాక్‌లు బంగారానికి సంబంధించినవని, మిగిలినవాటిలో పొటాష్, మోలిబ్డెనుమ్, బేస్ మెటల్స్ వంటివి ఉన్నాయని తెలిపింది. ఇవి జమ్మూ-కశ్మీరు, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయని వివరించింది. 2018-19 ఫీల్డ్ సీజన్ నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో ఈ బ్లాకులను సిద్ధం చేసినట్లు తెలిపింది. బొగ్గు, లిగ్నైట్‌లకు సంబంధించిన 17 రిపోర్టులను బొగ్గు మంత్రిత్వ శాఖకు అప్పగించినట్లు తెలిపింది. వీటిలో 7,897 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నట్లు వివరించింది.

2023-24 ఫీల్డ్ సీజన్‌ కోసం ప్రతిపాదించిన వార్షిక కార్యక్రమంపై ఓ సమావేశంలో చర్చించినట్లు గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023-24లో జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 966 ప్రోగ్రామ్స్‌ను చేపడుతుందని తెలిపింది. వీటిలో 306 మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ప్రాజెక్టులు, 12 మెరైన్ మినరల్ ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపింది.

లిథియం ప్రయోజనాలు ఇవే..
ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీల తయారీలో లిథియం చాలా ముఖ్యమైనది. బిగ్ బ్యాంగ్ నుంచి ఉత్పన్నమయ్యే ఏకైక లోహం ఇది. ఇది అత్యంత తేలికైన లోహం. నీటితో చేరినపుడు ఇది మండుతుంది. మాంసాన్ని కాల్చగలిగిన స్థాయిలో ఇది మండుతుంది. దీనిని ప్రధానంగా సెరామిక్స్ (పింగాణీ), గాజు, గ్రీజులు, ఫార్మాస్యుటికల్ కాంపౌండ్స్, ఎయిర్ కండిషనర్స్, అల్యూమినియం ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. అత్యధిక ఇంధన నిల్వ సామర్థ్యం (energy storage capacity) దృష్ట్యా బ్యాటరీ మెటీరియల్స్ మార్కెట్లో దీనిదే పై చేయి. తక్కువ సాంద్రతగల లోహం కావడమే దీనికి కారణం. బరువును పరిగణనలోకి తీసుకున్నపుడు ఇది చాలా చాలా ఉపయోగకరం. ఉదాహరణకు, టెస్లా కారు 600 కేజీల లిథియం బ్యాటరీతో నడవగలదు. అదే లెడ్-యాసిడ్ బ్యాటరీని ఉపయోగిస్తే, 4,000 కేజీల బరువుగల లెడ్-యాసిడ్ బ్యాటరీ అవసరమవుతుంది.

లెడ్-యాసిడ్ బ్యాటరీ మాదిరిగా కాకుండా లిథియం-అయాన్ బ్యాటరీలను 10 శాతం కెపాసిటీతో ఎటువంటి వైఫల్యం లేకుండా డిశ్చార్జ్ చేయవచ్చు. అనేక వేలసార్లు రీఛార్జి, డిశ్చార్జి చేయవచ్చు.

లిథియం నిక్షేపాలు మట్టి, శిలల్లో ఉంటాయి. ప్రపంచంలోని లిథియంలో దాదాపు సగానికిపైగా ఆస్ట్రేలియా నుంచి వస్తోంది. అందుబాటులో ఉన్న మొత్తం లిథియంలో కేవలం 18 శాతం మాత్రమే ప్రస్తుతం ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంది. చిలీ, అర్జంటైనా, బొలీవియాలను లిథియం ముక్కోణం అని పిలుస్తారు. ప్రపంచంలోని లిథియంలో సగం వరకు దక్షిణ అమెరికాలో ఉందని అమెరికన్ జియొలాజికల్ సర్వే అంచనా వేసింది. ప్రపంచంలో అత్యధిక లిథియం నిక్షేపాలు బొలీవియాలో ఉన్నాయి. అయితే ఆ దేశంలో ప్రభుత్వ నిబంధనల వల్ల ఈ గనుల తవ్వకాలపై చాలా ఆంక్షలు అమలవుతున్నాయి. లిథియం పరిమితంగా ఉన్నప్పటికీ, ఇది సజల రూపంలో సముద్రాల్లో దాదాపు 180 బిలియన్ టన్నులు ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీ మాత్రమే కాదు, లిథియం వ్యాలీ కూడా ఉంది. లిథియంను పర్యావరణానికి అనుకూల విధానాల్లో వెలికి తీసేందుకు పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు, స్టార్టప్‌లు, ఎనర్జీ ప్రొవైడర్లు ప్రయత్నిస్తున్నారు. దీనిని వెలికి తీసి, బ్యాటరీ తయారీ, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. సాల్టన్ సముద్ర ప్రాంతంలో ఉన్న లిథియంను వెలికి తీస్తే, 50 మిలియన్ల ఎలక్ట్రానిక్ వాహనాలకు బ్యాటరీలను తయారు చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇంత విలువైన నిక్షేపాలు మన దేశానికి లభించడం గొప్ప అదృష్టం.