
265views
యుద్ధ ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా నుంచి భారత్ భారీగా చమురును దిగుమతి చేసుకోవడంపై అమెరికా స్పందించింది. దానివల్ల తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చేసింది. భారత్‌పై ఆంక్షలు విధించే ఆలోచన తమకు లేదని పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి ఎవరూ చమురు కొనరాదని హెచ్చరిస్తున్న అమెరికా.. భారత్ విషయంలో మాత్రం మొదటినుంచీ ఆచితూచి వ్యవహరిస్తోంది. విధానపరమైన విభేదాలు ఉన్నప్పటికీ భారత్‌తో సంబంధాలు కలిగి ఉండటం తమకు అత్యంత కీలకమని అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి (యూరోపియన్ వ్యవహారాలు) కరెన్ డన్‌ఫ్రైడ్ స్పష్టం చేశారు. అయితే.. భారత్‌కు కేవలం రక్షణ భాగస్వామిగానే కాకుండా, దాని అనితరసాధ్యమైన ప్రగతితోనూ అతి ప్రధాన భాగస్వామిగా కూడా ఉండాలని తాము భావిస్తున్నామని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ పాట్రిక్ రైడర్ చెప్పారు.





