News

శ్రీశైలంలో సారా అమ్ముతున్న స్త్రీలు అరెస్ట్

35views

మద్యం సేవించడంలోనే కాదు.. అక్రమంగా మద్యం రవాణా చేయడంలో, విక్రయించడంలోనూ మహిళలు మగాళ్లతో పోటీ పడుతున్నారు. పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. బస్సుల్లో అక్రమంగా మద్యం తీసుకొచ్చి, గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్న ఐదుగురు మహిళల గుట్టును పోలీసులు రట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన ఐదుగురు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలానికి అక్రమంగా మద్యం, నాటు సారా తరలిస్తున్నారు. స్థానికంగా ఉన్న మాణిక్యమ్మపెల్ల, ఆర్టీసీ బస్టాండ్, సిద్ధ రామప్ప కాంప్లెక్స్ తదితర ప్రాంతాల సమీపంలో వీరు ఈ మద్యాన్ని విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న సదరు ఐదుగురు మహిళలను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద 314 క్వార్టర్ బాటిళ్లు, 24 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోని అరెస్ట్ చేశారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.