News

ఘనంగా భీమేశ్వరుని కల్యాణోత్సవాలు

283views

ద్రాక్షారామ భీమేశ్వరుని కల్యాణోత్సవాలలో ఆదివారం స్వామివారి వసంతోత్సవం ఆనందోత్సాహంతో జరిగింది. ఈ సందర్బంగా త్రిశూల, శ్రీచక్ర స్నానం శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం వేగాయమ్మపేట ఆస్థాన మండపంవద్ద నుంచి కల్యాణమూర్తులు మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి, లక్షీ సమేత నారాయణ స్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామివార్లను రథంపై ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం నిత్యపూజ, అర్చనలు జరిగాయి. తదుపరి మండపారాధన పూజలు ఆగమ పండితులు దేవులపల్లి ఫణిరామకృష్ణ నిర్వహించారు. గ్రామోత్సవం అనంతరం వసంతోత్సవం జరిగింది. కల్యాణమూర్తులైన అమ్మవారు,స్వామివార్లకు వసంతాలు చల్లారు అనంతరం అర్చక స్వాములు కల్యాణమూర్తులను చేతపట్టి వసంతాలు జల్లుకున్నారు. మంగళవాయిద్యాలకు అనుగుణంగా లయ బద్ధంగా నృత్యం చేస్తూ దండాడింపు, వసంతోత్సవం ఆహ్లాదంగా జరిగాయి. తదుపరి సప్తగోదావరి నదిలో త్రిశూల, శ్రీచక్రస్నానం అర్చక స్వాములు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు త్రిశూల, శ్రీచక్ర స్నానం కార్యక్రమంలో పాల్గొన్నారు.