
ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చెరకు పంట సాగు చేస్తున్న షామ్లీ ప్రాంతంలో భూమి కంపించింది. ఈ భూకంపం 5 కిలోమీటర్ల లోతులో సంభవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు చెప్పారు.
శనివారం రోజు మణిపూర్‌లో…
మణిపూర్ రాష్ట్రంలో శనివారం ఉదయం మళ్లీ భూకంపం సంభవించింది. మణిపూర్‌లోని ఉఖ్రుల్లో శనివారం ఉదయం 6.14 గంటల ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు నివేదికలు రాలేదు. భూకంపంతో మణిపూర్ ఉఖ్రుల్ నగర వాసులు తీవ్ర భయాందోళనలు చెందారు. భూమి కంపించడంతో ఉదయాన్నే ప్రజలంతా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.





