News

శ్వేతగిరి.. భక్త జనసంద్రం!

301views

శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని శ్వేతగిరి భక్త జనసంద్రమైంది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం గార మండలం శాలిహుండం(శ్వేతగిరి) కొండపై వెలసిన శ్రీ వేణుగోపాలస్వామి యాత్రకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేణుగోపాల.. పాహిమాం.. అంటూ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మెట్లమార్గంలో నడుచుకుంటూ.. మార్గమధ్యలో వీర వసన్తేశ్వరస్వామిని, దిగువన వరదరాజు స్వామి, నరసింహస్వామి దర్శించుకున్నారు. ముందుగా అర్చకులు మూలవిరాట్‌కు క్షీరాభిషేకం చేశారు. ట్రస్ట్‌ చైర్మన్‌ మధురెడ్డి దంపతులు, అర్చకస్వాములు అభిషేకాలు నిర్వహించారు. ఆపై ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగింపుగా వంశధార నదీతీరానికి తీసుకెళ్లి చక్రస్నానం చేయించారు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన భక్తులు.. పరవశించిపోయారు. యాత్రలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎస్‌ఐ ఎల్‌.మధుసూదనరావు సారధ్యంలో 350 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను భక్తులకు పంపిణీ చేశారు.