
మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ.. మనుషుల్ని లాక్కెల్లడం దేశ రాజధాని ఢిల్లీలో సాధారణమైపోతోంది. ఈ సారి ఏకంగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ను ఓ కారు డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు. దిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS) గేట్ నంబర్ 2 వద్ద గురువారం తెల్లవారుజామున 3.11 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆమెను కారుతో దాదాపు 10 నుంచి 15 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు ఆ దుండగుడు.
అసలు ఏం జరిగిందంటే..
దిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS) గేట్ నంబర్ 2 వద్ద కొంతమందితో కలిసి స్వాతి ఫుట్‌పాత్‌పై నిల్చుని ఉన్నారు. ఈక్రమంలో అక్కడికి కారులో హరీష్ అనే వ్యక్తి వచ్చి.. తన కారులో కూర్చోవాలని స్వాతిని అడిగాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో ఇరువురి మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. అనంతరం ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు కిటికీ లోపలికి చేయి పెట్టారు. దీంతో అతను కారు కిటికీ అద్దాన్ని అకస్మాత్తుగా మూసేయడంతో ఆమె చెయ్యి అందులో ఇరుక్కుపోయింది. అనంతరం అతను కారును జోరుగా నడిపిస్తూ, ఆమెను సుమారు 15 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనపై స్పందించిన దిల్లీ పోలీసులు వెంటనే హరీష్‌ను అరెస్టు చేశారు. మద్యం మత్తులోనే అతను అలా ప్రవర్తించాడని తెలిపారు. ఇటీవలే దిల్లీలో ఓ యువతిని కొందరు వ్యక్తులు కారుతో ఈడ్చుకెళ్లిన సంఘటనలో బాధితురాలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే





