
ముంబై: 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థాయితో పోలిస్తే, 13 రెట్లు పెరిగి 40 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.3,264 లక్షల కోట్ల) స్థాయికి వృద్ధి చెందొచ్చని రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ అంచనా వేశారు. శుద్ధ ఇంధన విప్లవం, డిజిటలీకరణ ఇందుకు తోడ్పాటు అందిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 3 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.245 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. 2047 కల్లా భారత్ అగ్రగామి మూడు దేశాల్లోకి వెళ్తుందని అంబానీ అన్నారు.
పండిట్ దీన్‌దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. 2047లో భారత్ 100వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుందని, ఇప్పటి నుంచి భవిష్యత్తును ‘అమృత కాలం’గా ముకేశ్ అంబానీ అభివర్ణించారు. శుద్ధ ఇంధన విప్లవం, బయో-ఇంధన విప్లవం, డిజిటల్ విప్లవం.. భారత్‌ను వృద్ధి పరంగా దశాబ్దాల ముందుకు తీసుకెళ్లాయని అభిప్రాయపడ్డారు. గొప్ప లక్ష్యాల దిశగా ఆలోచించడం, పర్యావరణహితం, డిజిలీకరణ విజయానికి మూడు మంత్రాలని విద్యార్థులకు సూచించారు. వినియోగం, సామాజిక- ఆర్థిక సంస్కరణలతో 2050 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చని ఇటీవల ఆసియా సంపన్నుడు గౌతమ్ అదానీ అంచనా వేశారు.





