
కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ కావడంతో.. తృణమూల్ పార్టీపై ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రి అఖిల్ గిరి క్షమాపణలు చెప్పారు. 17 సెకండ్లు ఉన్న ఓ వీడియో క్లిప్‌లో రాష్ట్రపతి ముర్ము గురించి మంత్రి గిరి అనుచిత కామెంట్ చేశారు.
మన రాష్ట్రపతి ఎలా ఉంటారు.. అంటూ ఆయన చేసిన సెటైరికల్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ వాళ్లకు తాను మంచి కనిపించడం లేదంటూ.. రూపం ద్వారా ఎవర్నీ అంచనా వేయలేమని, భారత రాష్ట్రపతిని గౌరవిస్తామని, కానీ ఆ రాష్ట్రపతి రూపం ఎలా ఉందంటూ మంత్రి గిరి వ్యాఖ్యలు చేశారు.
నందీగ్రామ్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “నేను బాగా కనిపించాను అని ఆయన (బీజేపీ నేత సువెందు అధికారి) అంటుంటారు. ఆయన ఎంత అందంగా ఉన్నారు! మనం ఒకరి అందం చూసి వారి గురించి నిర్ణయం తీసుకోము. మనం మీ రాష్ట్రపతి హోదాను గౌరవిస్తాము. కానీ, మీ రాష్ట్ర పతి ఏ విధంగా కనిపిస్తారు?” అని ప్రశ్నించారు.
అయితే, తన వాఖ్యలపై సర్వత్రా విమర్శలు చెలరేగడంతో ఆయన వెనుకడుగు వేసి, తాను `ప్రెసిడెంట్’ అని అన్నాను, కానీ ఎవరి పేరును ఎత్తలేదని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ఒకవేళ భారత రాష్ట్రపతి తన వ్యాఖ్యల పట్ల అవమానంగా ఫీలయితే, దానికి తాను సారీ చెబుతున్నాని మంత్రి అఖిల్ గిరి పేర్కొన్నారు.
ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ మహిళా కమిషన్ కు లేఖ రాశారు. అఖిల్ గిరిని తక్షణమే అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అంతే కాకుండా ఆయన్ని మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలని డిమాండ్ చేశారు.
Source: Nijamtoday





