Articles

ఖలిస్థాన్ వేర్పాటువాదానికి పాకిస్థాన్ బహిరంగ మద్దతు.

617views

పశ్చిమ భారతంలో భారత వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణకు, భారత వ్యతిరేక భావజాల వ్యాప్తికి ఖలిస్థాన్ వేర్పాటువాదులకు పాకిస్థాన్ మిల్లియన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని అందిస్తోంది.

ఒట్టావాలోని పార్లమెంట్ హిల్ వద్ద జరిగిన పాకిస్థాన్ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా పాకిస్థాన్ జాతీయుడైన కెనడియన్ సెనెటర్ సల్మాన్ అత్తావుల్లాజాన్ ప్రముఖ ఖలిస్థాన్ నాయకుడు సుఖ్మిందర్ సింగ్ హంసరాను ఆహ్వానించడం దీనికి నిదర్శనం.

హంసరా, కెనడా కేంద్రంగా జరిగే ఖలిస్థాన్ ఉద్యమానికి బహిరంగ మద్దతుదారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి. నిజానికి ఖలిస్థాన్ ఉద్యమానికి ప్రపంచవ్యాప్త సిక్కుల నుంచి లభిస్తున్న మద్దతు అంతంత మాత్రమే అయినా పాకిస్థాన్ మాత్రం దానిని పెంచి పోషిస్తోంది. అందుకు హంసరా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బహిరంగంగానే ధన్యవాదాలు తెలిపాడు కూడా.

పాక్ ప్రధాని, భారత ప్రధాని మోడీని ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్న సమయంలో “ఇమ్రాన్ సరికొత్త రాజకీయానికి తెర లేపారంటూ” ఇమ్రాన్ ని ప్రస్తుతించారు హంసరా.

నిజానికి హంసరా పాకిస్థాన్ దినోత్సవంలో పాల్గొనడం ఇండో – కెనడియన్లను, పాకిస్తాన్ను సైతం ఇరకాటంలో పడేసింది. పాకిస్థాన్ మాత్రం నిస్సంకోచంగా భారత వ్యతిరేక ఉద్యమాలకు చేయూతనందిస్తూనే వుంది.

ఇస్లామాబాద్ కు చెందిన ఇంటలిజెన్స్ సంస్థ ISI, ఈ ఉద్యమాలకు కేవలం ధనాన్ని సమకూర్చటమే కాకుండా, భారత వ్యతిరేక ఉద్యమ కార్యకలాపాల నిర్వహణను తమ భూభాగంలో అనుమతిస్తోంది కూడా.

ఖలిస్థాన్ మద్దతుదారులు పంజాబ్ భారత భూభాగంలో ఉండాలా వద్దా అన్న అంశంపై రిఫరండం నిర్వహించాలని పంజాబ్ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. పాక్ భూభాగంలో వున్న హసన్ అబ్దల్ సిటీలోని గురుద్వారా పంజా సాహిబ్ వద్ద జరిగే 320వ ఖాల్సా సజ్నా దివస్ లో ప్రపంచ వ్యాప్తంగా వున్న సిక్కులు, భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. ఆ సందర్భంగా రెఫరండంపై ప్రచారం నిర్వహించడానికి  “టీం 2020” పేరుతో ఒక సంస్థను కూడా రిజిష్టర్ చేయించడం గమనార్హం.

“సిక్కుల న్యాయం కోసం” అనే పేరుతో నడిచే సంస్థకు ఒక శాశ్వత కార్యాలయ ఏర్పాటుకు లాహోర్లో స్థలాన్ని కూడా ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వున్నా సిక్కులు ఈ ఉద్యమంలో భాగస్వాములు కాకపోయినాఖలిస్థాన్ అనుకూల ప్రాంతాలలో మాత్రం దాని విస్తృతికి విశేష ప్రయత్నం జరుగుతూ వుండడం ఆందోళనకరం.