News

ఏపీలో ఆల‌యాల సొమ్ము దుర్వినియోగం!

494views
  • పురాతన ఆలయాల పునరుద్ధరణ నిధిని కార్యాలయ మరమ్మతులకు వాడుకున్న వైనం

అమ‌రావ‌తి: ఆలయాల నుంచి సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్‌) కింద తీసుకునే సొమ్మును పురాతన ఆలయాల పునరుద్ధరణకు మాత్రమే వినియోగించాలని నిబంధనలున్నా.. కొత్త జిల్లాల్లో ఏర్పాటైన జిల్లా దేవాదాయశాఖ అధికారి కార్యాలయాల మరమ్మతులు, వాటిలో ఫర్నిచర్‌ కొనుగోలుకు వినియోగించేలా ఆదేశాలివ్వడం విమర్శలకు తావిస్తోంది.

ఒక్కో కార్యాలయానికి కనిష్ఠంగా రూ.3 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.8.50 లక్షల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.63.5 లక్షలు వెచ్చించేలా కమిషనరేట్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీటిని వివిధ ఆలయాల నుంచి తీసుకొని, అవి సీజీఎఫ్‌ కింద చెల్లించే మొత్తం నుంచి మినహాయించేలా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. వాస్తవానికి దేవాదాయశాఖ పరిధిలోని రూ.2 లక్షలపైన ఆదాయం ఉన్న ఆలయాలు, మఠాలు, సంస్థలు తదితరాలు సెక్షన్‌-70 ప్రకారం తమ రాబడిలో 9 శాతం సీజీఎఫ్‌కి జమ చేస్తాయి.

వీటిని పురాతన ఆలయాల పునరుద్ధరణకు, దూపదీప నైవేద్యాలు, అర్చకుల జీతాల కింద మాత్రమే వినియోగించాల్సి ఉంది. దానికి విరుద్ధంగా ఇప్పుడు ఆదేశాల్విడం గమనార్హం. గతంలో కూడా దేవాదాయ శాఖ అధికారుల కార్యాలయాల మరమ్మతులకు, ఇతర నిర్మాణాలు, వాహనాల కొనుగోళ్లు, తదితరాలకు ఈ నిధులు వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి