
* 40 వేల టన్నుల డీజిల్, 40 వేల టన్నుల బియ్యం, ఒక బిలియన్ యూఎస్ డాలర్ల సాయం
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత దేశం 40,000 టన్నుల డీజిల్‌ను పంపించింది. కొద్ది రోజుల నుంచి డీజిల్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు అనుభవిస్తున్న శ్రీలంక ప్రజలకు ఇది కొంచెం ఊరటనిచ్చే వార్త. ఈ వివరాలను సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ సుమిత్ విజేసింఘే చెప్పారని శ్రీలంక మీడియా తెలిపింది. భారత్-శ్రీలంక గత నెలలో 1 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దాదాపు 40 వేల టన్నుల బియ్యాన్ని శ్రీలంకకు పంపించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోందని ఓ వార్తా సంస్థ తెలిపింది. ఈ బియ్యం శ్రీలంకకు చేరితే, ఆ దేశంలో గత ఏడాది రెట్టింపు అయిన ధరలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం కలుగుతుంది. పట్టాభి ఆగ్రో ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ బీవీ కృష్ణారావు మాట్లాడుతూ, తాము మొదట ప్రాంప్ట్ షిప్‌మెంట్ కోసం కంటెయినర్లను లోడింగ్ చేస్తున్నామన్నారు. వెజల్ లోడింగ్ కొద్ది రోజుల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. భారత్-శ్రీలంక ప్రభుత్వాల మధ్య కుదిరిన రుణ ఒప్పందంలో భాగంగా ఈ సంస్థ శ్రీలంక స్టేట్ ట్రేడింగ్ (జనరల్) కార్పొరేషన్ కు బియ్యాన్ని సరఫరా చేస్తోంది.
కొన్ని దశాబ్దాల తర్వాత ఇటువంటి సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు అదనంగా 500 మిలియన్ డాలర్ల విలువైన ఇంధన సహాయాన్ని భారత్ అందజేస్తోంది. దీనిలో భాగంగానే డీజిల్ ను పంపించింది. ఈ వారంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. పెట్రోలు, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో రోజుకు 13 గంటలపాటు విద్యుత్తు కోతలను అమలు చేయడంతోపాటు పెట్రోలు బంకుల వద్ద సాయుద దళాలను మోహరించవలసి వస్తోంది.





