నిస్వార్ధ జీవి శ్రీ మూర్తి గారు – మనందరి రూపంలో వారు అమరులై ఉన్నారు – వారు ప్రారంభించిన కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడమే వారికి నిజమైన నివాళి : స్

2/1/2019, బుధవారం సాయంత్రం విజయవాడ నగరంలోని సిద్దార్ధ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో సామాజిక సమరసతా ఫౌండేషన్ అధ్యక్షులు స్వర్గీయ M.G.K. మూర్తి గారి సంస్మరణ సభలో హిందూ సమాజంలో సమరసతా సాధనకు శ్రీ మూర్తి గారు చేసిన కృషిని వక్తలు కొనియాడారు.
ధర్మ రక్షా కార్యానికి మనందరి సమయాన్ని సమర్పించి శ్రీ మూర్తి గారిని అమరుల్ని చెయ్యాలి – శ్రీ భాగయ్య :
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారు మాట్లాడుతూ, ఒక IAS ఆఫీసర్ గా తన విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించడమే కాకుండా, కౌటుంబిక, సామాజిక జీవనంలో కూడా అంతే శ్రద్ధ, నిబద్దతలతో తన బాధ్యతలు నిర్వర్తించిన ఆధునిక ఋషి శ్రీ మూర్తి గారని కొనియాడారు. కేరళలో కొంతమంది IASలతో జరిగిన ఒకానొక సమావేశంలో తాను శ్రీ మూర్తి గారి గురించి ప్రస్తావించినపుడు వారంతా గౌరవంగా నమస్కరించి “మూర్తి గారంటే నిప్పు లాంటి మనిషి” అని ముక్త కంఠంతో చెప్పారని తెలిపారు. హిందువులు మతాంతరీకరణ బారిన పడుతున్నారంటే దానికి మన సమాజంలోని లోపాలే కారణమని, ముందుగా వాటిని సరిదిద్దుకోవాలనే ఆలోచనతోనే S.S.F స్థాపనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. శ్రీ మూర్తి గారు సంపూర్ణ హిందూ సమాజంలో ఎకాత్మతను, సమరసతను దర్శించారని, సామాజిక అసమానతలను సాకుగా చూపి సమాజంలో విద్వేషాన్ని నింపే కార్యకలాపాలకు ప్రతిగా ఆత్మీయత, ఆప్యాయతల ఆధారంగా వ్యక్తుల హృదయాలను కలిపే కార్యాన్ని ప్రారంభించారని తెలిపారు. మనందరం శ్రీ మూర్తి గారు కలలు కన్న కార్య సాధనకు అత్యధిక సమయాన్ని కేటాయించడం ద్వారా ఇంటి ఇంటిలో,గుండె గుండెలో ధార్మిక చైతన్యాన్ని కలిగించి శ్రీ మూర్తి గారిని అమరుల్ని చెయ్యాలని ఆకాంక్షించారు.
ధార్మిక కార్యంలో నిమగ్నమైన పవిత్రాత్ములకు వినాశనం వుండదు – పూజ్య ప్రధమేశానంద :
చిన్మయా మిషన్ కు చెందిన పూజ్య ప్రధమేశానంద స్వామీజీ మాట్లాడుతూ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే దేహానికి, జీవుడికి, పరమాత్మకు మరణం ఉండదని, ముఖ్యంగా ధార్మిక కార్యాల్లో నిమగ్నమై జీవించిన వారికి వినాశనం ఉండదని, మరుజన్మలో కూడా మరింత ఉన్నతమైన గుణాలతో, ఉత్తమమైన లోకంలో జన్మిస్తారని తెలిపారు. శ్రీ మూర్తి గారికి పరమాత్మ ఖచ్చితంగా మరో ఉత్తమ జన్మను ప్రసాదిస్తాడని చెప్పారు. వారు ఎంత ఉదాత్తంగా జీవించారో అంతే గంభీరంగా లోకాన్ని విడచి వెళ్ళారని తెలిపారు. వారి పేరులోని M అంటే మంత, G అంటే జ్ఞాత, K అంటే కర్త, అంటే విశాల దృష్టి కోణం కలిగినవారని, జ్ఞానవంతులని, కార్య సాధకులని స్వామీజీ అభివర్ణించారు. స్వర్గీయ PVRK ప్రసాద్ గారు, MGK మూర్తి గార్లు భీష్మ, ద్రోణుల వలే ధర్మా రక్షా కార్య సాధనకు నడుం బిగించి వారి పదవీ విరమణానంతర కాలాన్ని సఫలం చేసుకున్న ధన్య జీవులని పేర్కొన్నారు.
ధీరోదాత్తుడైన నాయకుడు – శ్రీ శ్యాంప్రసాద్ :
1968 కేరళ IAS కేడర్ కు చెందిన శ్రీ మూర్తి గారు తన వృత్తి జీవితాన్ని బాధ్యతగా నిజాయితీగా నిర్వర్తించారని సామాజిక సమరసతా ఫౌండేషన్ సభ్యులు శ్రీ శ్యాంప్రసాద్ తెలిపారు. 2006 వ సంవత్సరంలో శ్రీ YS రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో SC క్రైస్తవులను కూడా SC జాబితాలో చేర్చే ప్రయత్నం జరుగుతున్నదని తెలిసి దానికి నిరసనగా శ్రీ బంగారు లక్ష్మణ్ నేతృత్వంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో శ్రీ మూర్తి గారు స్వయంగా పాల్గొని దీనివల్ల నిజమైన SC హిందువులకు అన్యాయం జరుగుతుందని, వారి ప్రయోజనాల రక్షణకు ఎంత దూరమైనా పోరాడాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అమలాపురంలో డా|| అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగినప్పుడు స్థానిక కార్యకర్తలు వెనుకడుగు వేసినా తానే ముందడుగు వేసి, నిలిచి పోరాడిన ధీశాలి శ్రీ మూర్తి గారని శ్యాంప్రసాద్ కొనియాడారు. SCలంటే క్రైస్తవులేననే అపోహ కోస్తా జిల్లాల్లో వుందని, ఈ అపోహను తొలగించాలని, నిజానికి తన లాంటి అనేక మంది, అనేక సవాళ్ళను అధిగమిస్తూ హిందువులుగా మనుగడ సాగిస్తున్నారని, వారందరికీ మిగిలిన హిందూ సమాజం ఆలంబనగా నిలిచి, అక్కున చేర్చుకోవాల్సిన అవసరముందని చెప్పేవారని తెలిపారు.
నిస్వార్ధ, నిరాడంబర సామాజిక సంస్కరణా కార్య యోజకుడు – శ్రీ చిలకపాటి విజయ రాఘవాచార్యులు :
స్వర్గీయ PVRK ప్రసాద్, MGK మూర్తులిరువురూ ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ అఫ్ లీడింగ్, ఆర్ట్ అఫ్ లీవింగ్ అంటే జీవించే, జీవ యాత్రను సాగించే, జీవన గమనాన్ని ముగించే కళలలో ఆరి తేరిన వారని విశ్రాంత అధ్యాపకులు శ్రీ చిలకపాటి విజయ రాఘవాచార్యులు తెలిపారు. వారిరువురూ నిరాడంబర, నిస్వార్ధ కార్య సాధకులు, కార్య యోజకులు అని అభివర్ణించారు. ఎంత అనారోగ్యంతో వున్నా శ్రీ మూర్తి గారు సామాజిక కర్యం కోసమే తపించారని తెలిపారు. మూర్తి గారి అస్తమయంతో వారు ఆరంభించిన కార్యం చుక్కాని లేని నావ కారాదని, సనాతన ధర్మానికి అంతం లేదని, మూర్తి గారి స్ఫూర్తి అందరిలో ప్రవేశించి గ్రామ గ్రామాన, వాడ వాడలా వేలాది PVRK లు, MGK లు నిర్మాణం కావాలని ఆకాంక్షించారు.
నిమ్న వర్గాలను మిగతా హిందూ సమాజం అక్కున చేర్చుకోవాలన్న వారి కల త్వరగా నేరవేరాలి – శ్రీ వెంకటేశ్వర్లు : స్వర్గీయ మూర్తి గారు ఏ పని చేసినా శ్రద్ధ, క్రమశిక్షణలతో చేసేవారని, కుటుంబానికి కూడా అంతే ప్రాదాన్యమిచ్చేవారని త్రిపుర రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రెటరీ, స్వర్గీయ మూర్తి గారి అల్లుడు శ్రీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎవరితోనైనా మృదువుగా వ్యవహరించే మూర్తి గారు పట్టుదల కలిగిన కార్య సాధకులని తెలిపారు. నిమ్న జాతుల ప్రజలను మిగతా హిందూ సమాజం తమలో మమేకం చేసుకోవాలన్నదే మూర్తి గారి కల అని. ఆ కలను వీలైనంత త్వరగా సాకారం చెయ్యడమే మనం వారికిచ్చే నివాళి అని శ్రీ వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు.
వారితో నా అనుబంధం మరువలేనిది – శ్రీ దాసరి శ్రీనివాసులు :
స్వర్గీయ మూర్తి గారితో తనకు దశాబ్దాల అనుబంధముందని, కుటుంబ సాన్నిహిత్యముందని రిటైర్డ్ IAS అధికారి శ్రీ దాసరి శ్రీనివాసులు తెలిపారు. శ్రీ మూర్తి గారు రిటైర్మెంట్ తర్వాత కూడా క్షణం తీరిక లేని జీవితాన్ని గడిపారని, ఒక IAS అధికారిగా ఎంత నిబద్దతతో పని చేశారో, పదవీ విరమణానంతరం స్వీకరించిన ధర్మోద్దరణ కార్యాన్ని కూడా అంతే నిబద్దతతో కొనసాగించారని, వారు సఫల సాధకులని శ్రీ శ్రీనివాసులు తెలిపారు.
మారు మూలల్లో, కొండకోనల్లోని ప్రజల కన్నీటి వీడ్కోలు – శ్రీ పాకాల త్రినాథ్ :
స్వర్గీయ PVRK ప్రసాద్ గారు, MGK మూర్తి గారు, శ్రీ దాసరి శ్రీనివాసులు గారి వంటి వారు దేశంలోని IAS లకందరికీ ఆదర్శమని సామాజిక సమరసతా ఫౌండేషన్ కార్యదర్శి శ్రీ పాకాల త్రినాథ్ అభిప్రాయపడ్డారు. 2015 డిసెంబర్ 2 న జరిగిన ధార్మిక సదస్సులో “నిమ్న కులాల వారు ఎందుకు హిందూ ధర్మాన్ని వీడి పోతున్నారు? కారణాలు తెలుసుకుంటున్నామా? వారిని ఎందుకు అక్కున చేర్చుకోలేక పోతున్నాం?” అంటూ వారు ఆవేదనాభరిత స్వరంతో ప్రశ్నిస్తూ వుంటే వేదిక పైనున్న స్వామీజీల కళ్ళు చెమర్చాయని వివరించారు. శ్రీ మూర్తి గారి మరణ వార్త తెలుసుకున్న మారు మూల గ్రామాల్లో, కొండల్లో కొనల్లోని ప్రజలు వారి చిత్రపటాన్ని పెట్టుకుని శ్రద్దాంజలి ఘటించి వారికి కన్నీటి వీడ్కోలు పలికారని, వారందరి హృదయాలలో వారు చిరంజీవిగా ఎప్పటికీ నిలచే ఉంటారని శ్రీ త్రినాథ్ తెలిపారు.





