News

గల్ఫ్‌ విమాన ప్రయాణాలపై ఆంక్షలను సడలించాలి

572views
  • జీసీసీ దేశాలకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: భారత దేశం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలను మరింత సడలించాలని గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌(జీసీసీ) దేశాలను విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కోరారు. కరోనా వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్లను గుర్తించాలని కూడా కోరారు.

జీసీసీ సెక్రటరీ జనరల్‌ నయేఫ్ ఫలాహ్ ముబారక్ అల్-హజరఫ్‌తో ఆయన సమావేశమై భారత దేశం-జీసీసీ సంబంధాలపై సమీక్షించి, వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించారు. నయేఫ్ ఫలాహ్ కువైట్‌ మాజీ ఆర్థిక మంత్రి 2020 ఫిబ్రవరిలో జీసీసీ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. నిన్న, ఈ రోజు ఆయన భారత దేశంలో పర్యటించేందుకు న్యూఢిల్లీ విచ్చేశారు. జైశంకర్‌, నయేఫ్‌ ఫలాహ్ భారత్‌-జీసీసీ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మార్గాలపై చర్చించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిన్న ఓ ప్రకటనలో తెలిపింది.

జీసీసీలో బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, కతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉన్నాయి. ప్రాంతీయ రాజకీయ, ఆర్థిక సహకారం కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఈ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో భారత దేశానికి వచ్చినవారు తిరిగి జీవనోపాధి కోసం ఈ దేశాలకు వెళ్ళడానికి వీలుగా ప్రయాణాలపై ఆంక్షలను సడలించాలని భారత దేశం కోరుతోంది.

కరోనా మహమ్మారి సమయంలో భారతీయుల పట్ల శ్రద్ధ వహించినందుకు, కరోనా రెండో ప్రభంజనం సమయంలో (ఏప్రిల్‌, మే నెలల్లో) వైద్యపరమైన సహాయం చేసినందుకు జీసీసీ దేశాలకు జైశంకర్‌ ధన్యవాదాలు తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి