అయోధ్య వివాదాస్పద భూమిలో నమాజుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్: పిటిషనర్కు 5 లక్షల జరిమానా విధించిన అలహాబాద్ హైకోర్టు.

అయోధ్యలోని రామజన్మభూమి వివాదాస్పద స్థలంలో తాము నమాజు చేసుకోవడానికి అనుమతి కావాలని కోరుతూ “అల్ రహ్మాన్ ట్రస్ట్” ద్వారా వేయబడిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు బెంచ్ శుక్రవారం డిస్మిస్ చేసింది. అంతే కాకుండా పిటిషనర్ ప్రచార దుగ్దతో పిటిషన్ను వేసి కోర్టు సమయాన్ని వృధా చేశారని మందలిస్తూ పిటిషనర్ కు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. అంతే కాకుండా పిటిషనర్ జరిమానాగా చెల్లించవలసిన మొత్తాన్ని వసూలు చేయవలనదిగా అయోధ్య జిల్లా D.A.M ను ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే “ అల్ రహ్మాన్ ట్రస్ట్ రాయబరేలిలో రిజిష్టర్ అయిన ముస్లిం విద్యా వ్యాప్తి, ఇస్లాం ప్రచారాలను నిర్వహించే సంస్థ. అలహాబాద్ హైకోర్టు 2010 వ సంవత్సరంలో అయోధ్య రామ మందిర వివాదాస్పద భూమి విషయమై ఇచ్చిన తీర్పుననుసరించి వివాదాస్పద స్థలంలో ముస్లిములకు 3వ వంతు భూభాగం కేటాఇంపబడినదని, ఆ స్థలంలో ఇప్పటికే రాంలాలా విగ్రహాలు స్థాపింపబడి హిందువులక్కడ పూజలు కూడా నిర్వహించుకుంటూ ఉన్నందున తమకు కూడా అక్కడ నమాజు చేసుకునే అవకాశం కల్పించాలని పిటిషనర్ కోరారు. పిటిషన్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను, అయోధ్య [ఫైజాబాద్] యొక్క మండలయుక్త్ [రిసీవర్] మరియు జిల్లా అధికారిని కక్షిదారులుగా పేర్కొంటూ ఈ పిటిషన్ వేశారు. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను కూడా పిటిషన్తో జతపరచారు.
రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ముఖ్య స్థాయి అడ్వకేట్ ప్రకాశ్ సింగ్ పిటిషనర్తో విభేధించారు. ఈ వివాదం ఇప్పటికే సుప్రీమ్ కోర్టులో నడుస్తున్నదని, వివాదాస్పద స్థలంపై తీర్పు వెలువడే వరకు యదాతధస్థితి [స్టేటస్ కో] ని కొనసాగించాలని కోర్టు ఆదేశించిందని, ఇంతలో ఇలాంటి పిటిషన్ వేయడం సబబు కాదని, పిటిషన్ చెల్లదని ప్రకాశ్ సింగ్ వాదించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పిటిషన్ కొట్టివేసి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గానూ పిటిషనర్కు జరిమానా విధించింది.





