
రాజమండ్రి పుష్కర ఘాట్లలో మత మార్పిడుల వివాదం సద్దుమణగక ముందే స్వయంగా ప్రభుత్వాధికారులే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తూండడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో మరోసారి రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళితే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో 21/12/2018 నాడు “ఐక్య క్రిస్మస్” వేడుకల పేరుతో ప్రీ క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతూండడం, అందుకు సంబంధించిన బ్యానర్లు ఆసుపత్రి ఆవరణలో కనపడడంతో వివాదం మొదలైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అన్య మత కార్యక్రమాలేమిటంటూ స్థానిక హిందువులు, హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
20/12/2018 గురువారం ఆసుపత్రి ఆవరణలో ఇందుకు సంబంధించిన బ్యానర్లను గమనించిన స్థానికులు హిందూ సంస్థల ప్రతినిధులకు సమాచారమివ్వటంతో ఘటనా స్థలానికి చేరుకున్న హిందూ చైతన్య వేదిక కన్వీనర్ పట్నాల సూరిబాబు, కో కన్వీనర్ దినేష్ వైష్ణవ్, సభ్యులు సతీష్, పి.వి. నరసింహారావు, మణికుమార్, వేణు, టి. శ్రీనివాస్ మరియు ధర్మవీర్ సంస్థ అధ్యక్షుడు విజయ్ ప్రసాద్, శ్రీనివాస్, పెరంబుదూర్, అయ్యప్ప తదితరులు ప్రభుత్వ రంగ సంస్థలలో అన్య మత సభలు, ప్రార్ధనలేమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై వారు ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ప్రశ్నించగా సదరు కార్యక్రమ నిర్వహణకు తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయని, అందుకే కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని బదులిచ్చారు. అయితే హిందూ సంఘాల నాయకులు దీనిపై వెంటనే తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు, సబ్ కలెక్టర్ కు వినతి పత్రాలు సమర్పించారు.
అయినప్పటికీ కార్యక్రమ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండడంతో హిందూ సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శుక్రవారం తమ నిరసనను వ్యక్తం చెయ్యడానికి హిందూ సంఘాలు ఆసుపత్రి ఎదుట ధర్నా చెయ్యడానికి సిద్ధపడుతున్న నేపధ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా హిందువుల అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రభుత్వమే అన్య మత కార్యక్రమాలకు చేయూతనివ్వడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





