
మంగళవారం నాడు కోయంబత్తూర్ సిటీ కార్పొరేషన్, నగరంలోని ముథనంకుళం కట్ట వెంట ఉన్న ఏడు దేవాలయాలను 100 సంవత్సరాల పురాతన ఆలయంతో సహా కూల్చివేసింది. ట్యాంక్ యొక్క ఉత్తర కట్ట వెంట ఆక్రమించిన భూమిలో ఆ దేవాలయాలు నిర్మింపబడ్డాయని కార్పొరేషన్ పేర్కొంది.
ముత్తన్నంకుళంలోని సరస్సు కట్టపై ఏడు హిందూ దేవాలయాలను కోయంబత్తూర్ నగర కార్పొరేషన్ కూల్చివేసిన తరువాత, హిందూ దేవాలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి అనేక మంది భక్తులు, హిందూ సంస్థలు కోయంబత్తూర్ వీధుల్లోకి వచ్చాయి. విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) కూడా దేవాలయాలను కూల్చివేయడాన్ని ఖండించింది.
తిరుపూర్ కలెక్టర్ కార్యాలయంతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు ఆలయ భూముల్లో ఉన్నాయని, అందువల్ల ఆ భవనాలను కూడా ఆ భూముల నుండి తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
దేవాలయాల కూల్చివేతను ఖండిస్తూ కోయంబత్తూరులోని టౌన్ హాల్‌లోని కార్పొరేషన్ కార్యాలయం వెలుపల హిందూ మున్నని కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
కూల్చివేతపై హిందూ మున్నని రాష్ట్ర అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రమణ్యం మాట్లాడుతూ “పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉండగా 75 సంవత్సరాల కంటే పాత దేవాలయాలను కూల్చివేయడాన్ని నిషేధిస్తూ పార్లమెంటులో ఒక చట్టం ఆమోదించబడింది. కానీ కోయంబత్తూర్ కార్పొరేషన్ శతాబ్దాల నాటి దేవాలయాలను కూల్చివేసింది. దేవాలయాల కూల్చివేతను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ”.
“హిందూ మత మరియు స్వచ్ఛంద సేవ, ఎండోమెంట్ (హెచ్ఆర్ అండ్ సిఇ) మంత్రి ఆలయం భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, దేవాలయాలను రక్షిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన వెల్లడించాలి ” అని సుబ్రమణ్యం అన్నారు.
ఆక్రమణలను తొలగించడం పేరిట కోయంబత్తూరు కార్పొరేషన్ ఉద్దేశపూర్వకంగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకుందని హిందూ మున్నని రాష్ట్ర కార్యదర్శి జెఎస్ కిషోర్‌కుమార్ ఆరోపించారు. ఆ పేరుతో 150 సంవత్సరాల నాటి పురాతన ఆలయాలను కూడా కూల్చివేశారని కిషోర్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.





