ArticlesNews

స్వాతంత్ర్య సంగ్రామం – విజ్ఞాన శాస్త్రవేత్తల పాత్ర

1.5kviews

స్వాతంత్ర్య సంగ్రామం అనగానే మనకు మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, భగత్ సింగ్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. భారత స్వతంత్ర సంగ్రామంలో విజ్ఞాన శాస్త్రవేత్తల పాత్ర అనగానే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.

ఏ విధంగా అయితే జాతీయ నాయకులు, విప్లవకారులు స్వాతంత్రం కోసం కృషి చేశారో అదే విధంగానే విజ్ఞాన శాస్త్ర వేత్తలు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఒకరకంగా జాతీయ నాయకుల కంటే ముందుగానే శాస్త్రవేత్తలు స్వాభిమానంతో పోరాడారు. భారత స్వతంత్ర సంగ్రామంలో శాస్త్రవేత్తల యోగదానం మహత్తరమైనది. శాస్త్రవేత్తల యోగదానాన్ని ప్రస్తుత సమాజానికి తెలియ పరచవలసిన బాధ్యత స్వదేశీ విజ్ఞాన ఉద్యమం అయిన విజ్ఞాన భారతి పైన ఉంది.

సర్వ సమర్పణ భావంతో భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర వ్యాప్తికి, తద్వారా దేశ స్వాతంత్ర్యం కోసము అనేకమంది కృషి చేశారు.

1757 లో ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ పరిపాలన బీహార్, బెంగాల్ ప్రాంతాలకు పరిమితమైనప్పటికీ భారతదేశం మొత్తం వారి దురాక్రమణ ప్రారంభమైంది అని మనందరికీ తెలుసు.

1760 లో ఇంగ్లండ్ లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. ఈ పారిశ్రామిక విప్లవం విజయం సాధించాలి అంటే
1. పెట్టుబడులు
2. ముడిసరుకు (వనరులు) అవసరం.

అటువంటి సందర్భంలో ఇంగ్లండుకు భారత దేశము మంచి వరంలాగా లభించింది. ఎందుకంటే అప్పటికి భారత దేశంలో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి సహజ వనరులకూ లోటు లేదు. 1818లో మరాఠా సామ్రాజ్య పతనం తర్వాత భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన సంపూర్ణంగా ప్రారంభమైంది. అయితే భారతదేశ ఆక్రమణకారులలో బ్రిటిషర్స్ మొదటి వారు కారు. మన దేశంపై అనేక దురాక్రమణలు జరిగాయి. భారత దేశం పైన దాడి చేసిన ఆక్రమణకారుల లక్ష్యము సైన్యంపై దాడి చేయడం, దోపిడీకి పాల్పడడం, మన సంస్కృతిని నాశనం చేయడం. కానీ ఆంగ్లేయుల యొక్క దురాక్రమణ స్వభావము కొంత విభిన్నమైనది. వారు కేవలము వ్యాపారం నెపంతో భారత దేశంలో అడుగు పెట్టారు. వ్యాపారం చేస్తూ విశ్వాస ఘాతుకానికి కుతంత్రాలకు పాల్పడుతూ మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. మనల్ని బానిసలుగా చేశారు. ఈ క్రమంలో వారికి ఒక మంచి సాధనంగా విజ్ఞాన శాస్త్రం నిలిచినది.

యూరప్ లో అప్పుడప్పుడే ఆవిష్కరించబడుతున్న విజ్ఞాన శాస్త్రము వారి చేతిలో గొప్ప ఆయుధంగా నిలిచింది. కాబట్టే విజ్ఞాన శాస్త్ర ఆధారంగానే వందల సంవత్సరాల దురాక్రమణ కన్నా కేవలం 190 సంవత్సరాలలో బ్రిటిష్ వారు భారత దేశాన్ని ఎంతో దోచుకున్నారు. బ్రిటిష్ వారు భారతదేశం రాక పూర్వం మన జీడీపీ 16 శాతం కన్నా పైబడి ఉండేది.ఇక్కడ సంపద ఉంది కాబట్టే అనేక మంది విదేశీ దురాక్రమణ దారులు ఈ దేశం పైకి దండయాత్రకు వచ్చారు.సంపద నిలయముగా ఉంది కాబట్టే భారతదేశం విదేశీ దురాక్రమణ కారుల లక్ష్యము అయింది. 1767 లో రాబర్ట్ క్లైవ్ భారతదేశంలో సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థను ప్రారంభించారు.ఇది భారత దేశంలో ప్రారంభించబడిన ప్రాచీనమైన విజ్ఞాన శాస్త్ర సంస్థ. ఈ సర్వే ఆఫ్ ఇండియా ప్రారంభం చేయడానికి గల కారణం ఏమిటి ఒకసారి ఆలోచిద్దాం. భారతదేశంలో తమ పరిపాలనను, రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకోవాలనే లక్ష్యంతో మరియు దేశంలో లభించే సహజ వనరుల అన్వేషణ కోసం చేయబడింది.

1757లో బ్రిటిష్ పరిపాలన ప్రారంభమయ్యాక కేవలం పది సంవత్సరాల కాలంలో సర్వే ఆఫ్ ఇండియా ని ప్రారంభించడం జరిగింది. తర్వాత కాలంలో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఫారస్ట్రీ వంటి సంస్థలు ప్రారంభించబడ్డాయి. ఇవన్నీ కూడా కేవలం తమ ఇంగ్లండ్ దేశానికి ఏవిధంగా ఉపయోగపడతాయో అన్వేషించడం కోసం తప్పితే భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఎంత మాత్రము కాదు.

ఈ సంస్థలలో భారతీయులకి కొన్ని ఉద్యోగాలు ఇచ్చేవారు అయితే భారత ఉద్యోగులకు ఆంగ్ల ఉద్యోగులకు మధ్య వ్యత్యాసం చూపేవారు. భారతీయులకు తక్కువ జీతం ఇచ్చేవారు. అంతేకాక అనేక అవమానాలకు గురి చేసేవారు. భారతీయ ఉద్యోగులు తెలివైనవారు అయినప్పటికీ కష్టపడే గుణం ఉన్నప్పటికీ కూడా వారిని ఎన్నడు ప్రోత్సహించేవారు కాదు. తక్కువ చేసి చూసే వారు. మన దేశంలోని హిమాలయాలలోని అత్యంత ఉన్నతమైన శిఖరం ఎవరెస్ట్ అని మనకి తెలుసు. కానీ ఆ శిఖరం ఎత్తు కొలిచే సర్వేక్షణ లో పాల్గొని సర్వే చేసిన శ్రీ రాధానాథ్ సిక్దర్ పేరు ఎవరికీ తెలియదు. ఆ అత్యున్నత శిఖర అధ్యయనంతో సంబంధం లేని ఎవరెస్ట్ యొక్క పేరును ఆ శిఖరానికి పెట్టడం జరిగింది. భారతీయ శాస్త్రవేత్తల పట్ల వ్యవహరించిన అన్యాయానికి ఉదాహరణ ఇది. దేశంలో ఆంగ్లేయలచేత ప్రారంభం చేయబడిన మెడికల్ సైన్స్ విభాగం కేవలం ఆంగ్లేయ సైనికులకు సహాయపడటం కోసం మాత్రమే. అదేవిధంగా పోస్ట్ & టెలిగ్రాఫ్ , రైల్వేలు. భారతదేశంలో రైల్వే నిర్మాణం మనదేశంలోని వనరుల తరలింపు కోసం మాత్రమే సాగింది. పోర్టుల దాకా రైల్వే లైన్లు ఏర్పరచి అక్కడినుంచి ఇంగ్లండుకు సహజ వనరులను తరలించడం జరిగింది. కానీ ఇప్పటికీ మనదేశంలో చాలామంది ఆంగ్లేయుల వలనే విజ్ఞానము – సాంకేతికత భారతదేశానికి వచ్చింది అనే భావనలో ఉంటారు. ఒకవేళ ఆంగ్లేయులు కనుక లేకపోతే మనం ఎంతో అంధకారంలో పడి పోయే వాళ్ళం అనే భావన కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆంగ్లేయులు మన కన్నా చాలా గొప్పవారు మనం తక్కువ వారం అనే భావన కూడా చాలామందిలో ఉంటుంది. దీనికి కారణం ఆంగ్లేయులు భారతీయులకు విజ్ఞానము సాంకేతికత పట్ల అవగాహన లేదు అని చేసిన దుష్ప్రచారం.అలాగే భారతీయులకు తర్క బద్ధమైన ఆలోచన చేయగలిగే శక్తే లేదు అనేవారు.

జగదీష్ చంద్రబోస్ గొప్ప భౌతిక శాస్త్రవేత్త. ఇంగ్లాండ్ లో భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి భారతదేశం వచ్చాక వారిని భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా నియమించడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఎందుకంటే అప్పటికి మన దేశంలో రెండు రకాల విద్యావిధానాలు ఉండేవి. ఒకటి ఇంపీరియల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ రెండవది ప్రైమరీ ఎడ్యుకేషన్ సర్వీసెస్. మొదటిది కేవలం ఇంగ్లీషు వారు మాత్రమే చెప్పాలి. మొదటి సర్వీసులో ఆంగ్లేయులు మాత్రమే పని చేయాలి. భారతీయులు కేవలం ప్రాథమిక విద్యా బోధనకు మాత్రమే అర్హులు అనే భావన వారిది. అంతేకాకుండా జగదీష్ చంద్రబోస్ కి వ్రాసిన లేఖలో భారతీయులకు తర్క బధ్ధమైన ఆలోచనాశక్తి లేనే లేదు కాబట్టి వారు భౌతిక శాస్త్రము వంటి విద్యలను బోధించడానికి అనర్హులు అని పేర్కొన్నారు. ఆ విధంగా కేవలం జగదీష్ చంద్ర బసు నే కాకుండా యావత్ భారతీయులను అవమాన పరిచారు ఆంగ్లేయులు. దీనికి వ్యతిరేకంగా 1884లో జగదీష్ చంద్రబోస్ సత్యాగ్రహం చేశారు దండి సత్యాగ్రహం కన్నా ఎంతో ముందే సత్యాగ్రహం చేసిన వ్యక్తి జగదీష్ చంద్ర బసు.ఆంగ్లేయులే కాదు భారతీయులకు తర్క బద్ధమైన ఆలోచనా శక్తి ఉంటుంది మేము కూడా చాలా బాగా భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేయగలము, బోధించగలమని నిరూపిస్తానని ఆయన పోరాటం చేశాడు. ఒకరోజు, ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరము కాకుండా మూడు సంవత్సరాల పాటు జగదీష్ చంద్రబోస్ పోరాడాడు. మూడు సంవత్సరాలు వేతనము తీసుకోకుండా దేశం కోసం అవమానాన్ని సహిస్తూ పోరాడారు. భారతీయులు ఆంగ్లేయులకు చేసిన అవమానాన్ని ఎదుర్కొని నిలబడ్డారు.

ప్రమథనాథ బసు ( PN Bose) అనే భారతీయ శాస్త్రవేత్త హిస్టరీ ఆఫ్ హిందూ సివిలైజేషన్ పేరుతో మూడు గ్రంథాలు వ్రాయడం జరిగింది. మేధావి అయిన ఈయన గొప్ప భూగర్భ శాస్త్రవేత్త. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు.చాలా అనుభవజ్ఞుడు అయినప్పటికీ జి ఎస్ ఐ డైరెక్టర్ గా ఆయనను నియమించలేదు . భారతీయులకు విజ్ఞాన శాస్త్రంలో నడకే రాదు అటువంటిది పరుగెత్త గలుగుతారా అని ప్రశ్నించి ఆయనను అనర్హుడుగా ప్రకటించారు. ఆయన కన్నా పది ఏళ్ళు జూనియర్ అయిన బ్రిటిషర్ అయిన హాలెండ్ ను డైరెక్టర్ గా నియమించారు.

ప్రమథ నాధ బసు తర్వాత కాలంలో జంషెడ్జీ టాటాను కలిసి ఆయన చేసిన అధ్యయనాలను వారితో పంచుకోవడం జరిగింది. జార్ఖండ్ లో ఉక్కు లభిస్తుందని అక్కడ పరిశ్రమ నెలకొల్పితే దేశానికి లాభం చేకూరుతుందని తెలిపారు.

అదేవిధంగా ప్రఫుల్ల చంద్ర రే ఇంగ్లండ్ నుంచి తిరిగివచ్చాక ఆయనకూ ఇంపీరియల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లో పని చేసే అవకాశం ఇవ్వలేదు. అనేక అవమానాలకు గురి చేశారు. ఆ అవమానాలు అన్నీ సహిస్తూ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అనే గ్రంధాన్ని వ్రాసి భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర పునాదులను తెలియజేశారు. స్వదేశీ విజ్ఞాన శాస్త్ర ప్రగతికి బీజం వేశారు. హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ లో వారు వ్రాసిన అనేక అధ్యాయాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేచర్ జనరల్ లో ప్రచురించబడ్డాయి. కానీ ఈ విషయం ఇప్పటికీ చాలా తక్కువ మందికి తెలుసు. బహుశా చాలా తక్కువ మంది చదివి ఉంటారు. కారణము ఆంగ్లేయులు మనలని పక్కదారి పట్టించడమే. విజ్ఞాన శాస్త్రము అనగానే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినది అనే ఆలోచన కలిగించారు. భారతదేశంలో విజ్ఞానము లేదు అని దుష్ప్రచారం చేశారు. విజ్ఞాన శాస్త్ర పరిశోధనల తోటే సమాజపు, దేశపు పురోగతి సాధ్యం అని మనందరికీ తెలుసు . ఆంగ్లేయులు మనదేశంలో విజ్ఞాన శాస్త్ర పరిశోధనా సంస్థలను ప్రారంభం చేయలేదు. భారతీయులను పరిశోధనా రంగం వైపు ప్రోత్సహించలేదు. అయినా భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం పట్ల అవగాహన, అధ్యయనం ఉన్న జగదీష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. భారతదేశంపై ఆంగ్లేయులు చేస్తున్న దమన కాండ, అవమానాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచారు. భారతీయులకు తర్క బద్ధ ఆలోచన ఉండదు అనే బ్రిటిష్ వారి సవాలును స్వీకరించి సత్యాగ్రహం చేసిన గొప్ప దేశభక్త శాస్త్రవేత్త జగదీశ్ చంద్ర బోసు.

1895లో మైక్రోవేవ్ లను ఆవిష్కరించి ఫాదర్ ఆఫ్ మైక్రోవేవ్స్ గా జగదీష్ చంద్రబోస్ నిలిచారు. ఈ ప్రయోగాలు ఆయన తన స్వంత నిధులతో, బ్రిటిషర్స్ నుంచి ఎటువంటి సహకారం లేని సమయంలో చేశారు. పని చేసిన పరిశోధనల పైన పేటెంటు పొందాలనే ఆలోచన కూడా చేయలేదు జగదీష్ చంద్రబోస్. తర్వాతికాలంలో మార్కోని తానే మైక్రోవేవ్ కనుగొన్నట్లు గా ప్రపంచానికి చాటుకున్నాడు.

మన దేశంలో 1905 లో వందేమాతర ఉద్యమం సాగింది. ఆ ఉద్యమం కంటే పది సంవత్సరాల ముందే బెంగాల్ లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు జగదీష్ చంద్ర బసు. తన ప్రయోగాల ద్వారా భారతీయుల ప్రతిభ ప్రపంచానికి , ముఖ్యంగా ఆంగ్లేయులకు తెలియజేశారు జగదీష్ చంద్రబోస్. శ్రీ మహేంద్ర లాల్ సర్కార్ మనదేశంలో భారతీయుల చేత నడపబడే ఒక విజ్ఞాన శాస్త్ర సంస్థ ఉండాలని భావించి కోల్ కతా లో ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ని ప్రారంభించారు.

అనీబిసెంట్ చే ప్రారంభించబడిన జాతీయ కాంగ్రెస్ కంటే 9 సంవత్సరాల ముందే మహేంద్ర లాల్ సర్కార్ ప్రారంభం చేసిన ఆ సంస్థ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి గొప్ప శాస్త్రవేత్తలను అందించింది. ఈ సంస్థ లో పరిశోధనలు జరిపే శ్రీ సివి రామన్ ఆసియాలోనే మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత గా నిలిచారు. దేశభక్తి తో , స్వాభిమానంతో ప్రారంభించబడినసంస్థ కాబట్టి IACS నుండి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉద్భవించారు. నోబెల్ పురస్కారాన్ని తీసుకునే సమయంలో సివి రామన్ ఎంతో బాధ పడ్డారు, కన్నీటిపర్యంతమయ్యారు. నేను ఈ పురస్కారాన్ని బ్రిటిష్ జెండా కింద తీసుకోవడం జరుగుతోంది. ఇది నాకు అవమానం. నా దేశం స్వతంత్రం కాదు. నా భారత్ కు జెండా లేదు అని ఆయన బాధ పడ్డారు. స్వ అనే ఆలోచనని, మన గుర్తింపు ని మర్చిపోయేలా చేశారు బ్రిటిష్ వారు. భారతదేశం అనగానే అజ్ఞానముతో, అంధకారము తో నిండి తర్కము లేని సమాజం అని ముద్ర వేశారు. మేధావులయిన మన భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తలు వారి అధ్యయనంతో, ప్రయోగాల ద్వారా స్వాభిమాన శంఖాన్ని పూరించారు. వారందరి లక్ష్యము భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దడమే.

ప్రఫుల్ల చంద్ర రే 1901లో బెంగాల్ కెమికల్స్ ను ప్రారంభం చేశారు. అంతేకాకుండా టాటా లకు సల్ఫ్యూరిక్ యాసిడ్ ని తయారు చేసే విధానాన్ని తెలియ చెప్పినటువంటి వ్యక్తి. ఆ విధానము కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని నిరూపించిన వ్యక్తి ప్రఫుల్ల చంద్ర రాయ్.

భారతదేశంలో ఎక్కడ, ఏవిధంగా పరిశ్రమలు నెలకొల్పాలో చక్కటి విశ్లేషణ చేసిన వ్యక్తి మదన మోహన మాలవ్య. భారతదేశంలో పరిశ్రమలు స్థాపించాలనే లక్ష్యంతోనే బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఆంగ్లేయులు విజ్ఞానశాస్త్రం మాధ్యమంగా మనల్ని అణిచి వేయడానికి బానిసలు చేయడానికి ప్రయత్నం చేస్తే అదే విజ్ఞాన శాస్త్రము ద్వారా వారితో పోరాడిన శాస్త్రవేత్తల పరంపర మనకు ఉంది.

CV రామన్ మేనల్లుడు చంద్రశేఖర్ నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. అమెరికా పౌరుడిగా ఆయన నోబెల్ బహుమతి అందుకున్నాడు. ఆయనను ఒక సందర్భంలో ఇంటర్వ్యూ లో భారతదేశంలో విజ్ఞానశాస్త్రంలో స్వర్ణ యుగము ఎప్పుడు అని అడిగితే 20వ శతాబ్దం ప్రారంభ సమయం అని చెప్పడం జరిగింది. ఆంగ్లేయులు పరిపాలిస్తున్న ఆ సమయంలో ఏ విధంగా స్వర్ణయుగంగా ఉంటుంది అని అడిగితే ఈ దేశంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు బ్రిటిషర్స్ కి ఎదురునిలిచి గొప్ప గొప్ప శాస్త్ర ప్రతిపాదనలు చేసిన సమయమది, సత్యేంద్రనాథ్ బోస్ , మేఘనాథ్ సాహా, సివి రామన్ వంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు దేశ భక్తి ప్రపూర్ణ తో ఆంగ్లేయుల్ని ఎదుర్కొని ప్రేరణ దాయక పోరాటం చేశారు కాబట్టి ఆ కాలమే విజ్ఞాన శాస్త్రానికి స్వర్ణయుగమని చంద్రశేఖర్ పేర్కొనడం జరిగింది. ఈ విషయాలన్నీ మనము సమాజంలో కి తీసుకొని వెళ్ళాలి.

ఏ విధంగా అయితే వేలాది మంది స్వాతంత్ర సమర యోధులు దేశంకోసం పోరాడారో అదేవిధంగా అనేక మంది శాస్త్రవేత్తలు తమ సత్యాగ్రహంతో, త్యాగంతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా విజ్ఞాన శాస్త్ర మాధ్యమంగా పోరాటం చేశారు. భారత్ ను స్వతంత్రం చేయాలని తమ జీవితాలను అర్పించారు. విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల ద్వారా విజ్ఞాన శాస్త్ర ప్రతిపాదనల ద్వారా భారత దేశాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి అని ఎంతో కృషి చేశారు. అటువంటి శాస్త్రవేత్తలను ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా తలుచుకోవాలి. మన దేశాన్ని విశ్వ గురు భారత్ గా నిలపాలన్న వారి ఆశయాలకనుగుణంగా మనం పని చేయాలి. నలంద విశ్వవిద్యాలయ సమయంలో ఉన్న వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలని కోరుకొన్న అబ్దుల్ కలాం గారి మాటలను సాకారం చేయడం కోసం కృషి చేయాలి. భారత దేశం లో విజ్ఞాన శాస్త్ర రంగంలో కృషి చేసిన మహనీయుల జీవితాలు అందరికీ అందించాలి.

(విజ్ఞానభారతి 4వ రాష్ట్రీయ అధివేషన్ లో విజ్ఞాన భారతి సంఘటనా కార్యదర్శి శ్రీ జయంత్ సహస్రబుధ్ధే ప్రసంగానికి అనువాదం)

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.