News

ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యం : జమ్మూ కాశ్మీర్ అఖిలపక్ష భేటీలో ప్రధాని మోడీ

455views

మ్మూకశ్మీర్ కు చెందిన వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగిన ఈ సమావేశం మూడు గంటల పాటు సాగింది. మొత్తం 8 పార్టీల నుంచి 14 మంది నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ ‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే అంశంపై ఈ భేటీలో ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని విపక్ష నేతలు తెలిపారు. అలాగే జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి గురించి నేతలు ప్రస్తావించిన పలు అంశాలను ప్రధాని మోడీ ఓపిగ్గా విన్నారని చెప్పారు. ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్‌షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ ‌కు చెందిన మెహబూబా ముఫ్తీ, ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, గులాంనబీ ఆజాద్‌, యూసఫ్‌ తరిగామి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిలో భాగంగా ఐదు డిమాండ్లు ఈ సమావేశం ముందుంచినట్లు కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. రాష్ట్ర హోదా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజకీయ ఖైదీల విడుదల, కశ్మీర్‌ పండిట్లకు పునరావాసం తదితర అంశాలను లేవనెత్తినట్లు చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని హోంమంత్రి అమిత్‌షా చెప్పినట్లు తెలిపారు. హోదా పునరుద్ధరణకు మోడీ సానుకూలంగా ఉన్నారని, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారని ఈ భేటీకి హాజరైన ఆప్నీ పార్టీ నేత అల్తాఫ్‌ బుఖారీ తెలిపారు. పునర్విభజన ప్రక్రియలో భాగస్వాములు కావాలని చెప్పారని అన్నారు.

ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యం: ప్రధాని

జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. ఆ దిశగా అఖిలపక్ష భేటీ జరిగిందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి చెందాలంటే ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వం అవసరమని, అందుకోసం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అంతకంటే ముందు నియోజకవర్గాల పునర్విభజన త్వరితగతిన జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు భేటీ అనంతరం ఆయన ట్వీట్‌ చేశారు.

జమ్మూకశ్మీర్‌ సమగ్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. అఖిలపక్ష భేటీలో జమ్మూకశ్మీర్‌ భవిష్యత్‌ గురించి చర్చించామని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణలో నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ మైలురాళ్లు అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.