News

90 శాతం సమర్థత కలిగిన చౌక ధర స్వదేశీ టీకా……

694views

భారత్‌లో అతితక్కువ ధర వ్యాక్సిన్‌ తయారికీ హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బయోలాజికల్ ఈ ఫార్మా అభివృద్ధి చేసిన కార్బివాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే డీసీజీఐ మూడో దశ క్లినకల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులిచ్చింది. అయితే.. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ అభివృద్ధి చేస్తోన్న టీకాల్లో కార్బివాక్స్ కూడా సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌ టీకా మహమ్మారిని నిరోధించడంలో మెరుగైన పనితీరు కనబరుస్తోంది.

అయితే.. బయోలాజికల్‌ ఇ కార్బివాక్స్‌ కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 90శాతానికిపైగా ప్రభావశీలత చూపిస్తున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు నొవావాక్స్‌ టీకా ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. అయితే.. భారత్‌లోనే ఏటా దాదాపు వంద కోట్ల డోసులు ఉత్పత్తి కానుండడంతో ఈ టీకాలపై అంచనాలు మరింత పెరిగాయి. 90 శాతం సామర్థ్యం కలిగిన ఈ టీకాలు చౌక ధరలోనే అందుబాటులోకి రానున్నాయి. బయోలాజికల్‌ ఇ (బీఈ) వ్యాక్సిన్‌ మంచి ఫలితాలు కనబరుస్తుందని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్‌ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో వినియోగించిన సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ టీకాలు అన్ని వయసులవారికీ సురక్షితమని పేర్కొన్నారు. అక్టోబర్‌ నాటికి ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

తుది ఫలితాలు ఇదే విధంగా ఉంటే.. కోవిడ్ పోరులో కార్బివాక్స్, నోవావాక్స్ వ్యాక్సిన్‌లు గేమ్‌ ఛేంజర్‌గా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్బివాక్స్‌ మూడోదశ ప్రయోగాలు జులై నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.