ArticlesNews

కాలు దువ్వుతున్న చైనా

934views

భారత్‌తో ఘర్షణకు మరింత ఆజ్యం పోసేలా చైనా వ్యవహరిస్తోంది. ఒకపక్క శాంతి వచనాలు పలుకుతూనే మరోపక్క సైనిక మోహరింపులకు దిగుతోంది. భారత్‌కు చేరువలోని వైమానిక స్థావరంలో అధునాతన స్టెల్త్‌ యుద్ధవిమానాలను రంగంలోకి దించింది. తద్వారా తన రెండు నాల్కల ధోరణిని బయటపెట్టుకుంది.

రెండు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటన్‌ వైమానిక స్థావరంలో రెండు జె-20 స్టెల్త్‌ యుద్ధవిమానాలను మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. ఇక్కడ ఇప్పటికే జె-10, జె-11 యుద్ధవిమానాలను మోహరించింది. తాజాగా జె-20కి తోడు జె-8, జె-16లనూ రంగంలోకి దించినట్లు స్పష్టమవుతోంది.

భారత్‌తో ఘర్షణకు దిగాల్సి వస్తే సైన్యం కన్నా వాయుసేన, క్షిపణులు, డ్రోన్లపైనే చైనా ఎక్కువగా ఆధారపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో తాజా మోహరింపులకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్‌ కూడా తన అగ్రశ్రేణి యుద్ధవిమానాలైన సుఖోయ్‌-30, మిగ్‌-29కె, సి-17 రవాణా విమానాలు, పి-8ఐ నిఘా విమానం సహా చినూక్, అపాచీ హెలికాప్టర్లు, మానవ రహిత విమానాలను లేహ్‌ వైమానిక స్థావరంలో మోహరించింది. మొత్తం మీద రెండు దేశాలూ కలిసి సరిహద్దుల్లో లక్ష మందికిపైగా సైనికులు, భారీ ఆయుధాలను దించాయి. దీంతో ఈ సరిహద్దు వివాదం పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం పొంచి ఉంది.

ప్రపంచంలో మూడోది..

హోటన్‌లో మోహరించిన జె-20 యుద్ధవిమానాలను చెంగ్డూ సంస్థ రూపొందించింది. ఇవి ఐదో తరం యుద్ధవిమానాలు. 2017 సెప్టెంబర్‌లో ఇవి పూర్తిస్థాయిలో చైనా వాయు సేనలో చేరాయి. వీటి ఉత్పత్తిని చైనా ఇటీవలే ప్రారంభించి ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే 20 ఏళ్లలో ఇవి డ్రాగన్‌ వాయుసేనకు వెన్నెముకగా ఉంటాయి. ఐదో తరం యుద్ధవిమానాల్లో.. శత్రు రాడార్లను బోల్తా కొట్టించే స్టెల్త్‌ లక్షణం ఉంటుంది. దీనికితోడు అవి చాలా వేగంగా దూసుకెళతాయి. చాలా సులువుగా క్లిష్టమైన విన్యాసాలను చేయగలుగుతాయి. జె-20 యుద్ధవిమానంలో రష్యాకు చెందిన ఏఎల్‌-31 ఇంజిన్లను అమర్చారు. ఒకటి రెండేళ్లలో వీటి స్థానంలో చైనీస్‌ డబ్ల్యూఎస్‌-10 తైహాంగ్‌ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం చైనా వాయుసేనలో దాదాపు 30 జె-20 యుద్ధవిమానాలు ఉండొచ్చని అంచనా. అమెరికాకు చెందిన ఎఫ్‌-22ఎ రాఫ్టర్, ఎఫ్‌-35 యుద్ధవిమానాల తర్వాత పూర్తిస్థాయిలో సిద్ధమైన ఐదోతరం లోహ విహంగం ఇదే.

చైనాపై అమెరికా గురి

మరోవైపు చైనాకు దూకుడుకు కళ్లెం వేసే ఉద్దేశంతో అమెరికా కూడా చర్యలు చేపడుతోంది. ఫలితంగా ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో స్టెల్త్‌ యుద్ధవిమానాల గర్జనలు పెరిగాయి. చైనాకు హెచ్చరిక సందేశం ఇచ్చేందుకు హిందూ మహాసముద్రంలో ఉన్న డీగో గార్షియా దీవిలో మూడు బి-2 స్టెల్త్‌ బాంబర్లను అమెరికా మోహరించింది. జపాన్, దక్షిణ కొరియాల్లోనూ ఎఫ్‌-35, ఎఫ్‌-22 విమానాలను మోహరించింది. మరోవైపు ఈ ప్రాంతంలో భారత్‌ సహా ఇతర మిత్ర దేశాలకు తన మద్దతు ఉందని చాటి చెప్పేందుకు కాలు వాస్తవాధీన రేఖకు చేరువలో బి-2 బాంబర్లతో గగనవిహారం, విన్యాసాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. చైనాను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన ‘చతుర్భుజి కూటమి’ని బలోపేతం చేసే అంశంపైనా చర్చలు జరుగుతున్నాయి.

డ్రాగన్‌ వైఖరిపై సెనేట్‌ ఖండన

సైనిక బలప్రయోగంతో వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని అమెరికా సెనేట్‌ ఖండించింది. చైనా చర్య అంతర్జాతీయ భద్రత, సుస్థిరతలకు ముప్పు కలిగిస్తోందని ఆరోపించింది. భూటాన్‌ భూభాగాన్ని తనదిగా చైనా చెబుతోందని, అరుణాచల్‌ ప్రదేశ్‌పై హక్కులు కోరేందుకే ఇలా చేస్తోందని విమర్శించింది. సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. చైనా ముప్పు నుంచి తన టెలికం మౌలిక వసతులను రక్షించుకునేందుకు భారత్‌ చేపట్టిన చర్యలను ప్రశంసించింది. భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిని పెంపొందించడానికి ‘చతుర్భుజ’ కూటమి వంటి బహుళపక్ష భాగస్వామ్య వేదికలకు మద్దతు పలికింది. సెనేటర్లు జాన్‌ కార్నిన్, మార్క్‌ వార్నర్‌లు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత్‌-అమెరికాల మధ్య రక్షణ, ఆర్థిక బంధం మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు.

పాక్‌ సరిహద్దుల్లో తేజస్‌..

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పాకిస్థాన్‌ వెంబడి ఉన్న సరిహద్దుల్లో తేజస్‌ యుద్ధవిమానాలను భారత్‌ మోహరించింది. ప్రస్తుతం తమిళనాడులోని సూలురులో ఉన్న ఈ లోహవిహంగాలను అక్కడికి తరలించింది. దేశీయంగా రూపొందిన ఈ యుద్ధవిమానాలను సరిహద్దుల్లో మోహరించడం.. స్వదేశీ సాంకేతిక సత్తాకు దక్కిన పెద్ద విజయమని నిపుణులు చెబుతున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లోని అన్ని వైమానిక స్థావరాలను వాయుసేన అప్రమత్తం చేసింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా యుద్ధవిమానాలను సిద్ధంగా ఉంచింది.

ఈనాడు సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.