News

చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేద్దాం – 3 ఇడియట్స్ రియల్ హీరో

1.2kviews

బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘3ఇడియట్స్‌’ గుర్తుంది కదా! దానిలో ఆమిర్‌ ఖాన్‌ రీల్‌ పాత్రకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్‌. ఇప్పుడు ఈ ఇన్వెంటర్ సరిహద్దుల్లో చైనా దురహంకారాన్ని వ్యతిరేకిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆయన లద్దాఖ్‌లో హిమాలయాలకు దగ్గరగా, సింధు నది ఒడ్డున కూర్చొని మేడిన్‌ చైనా ఉత్పత్తులను వాడొద్దంటూ ప్రజలకు పిలుపునివ్వడం దానిలో కనిపిస్తుంది.

‘ఒకవైపు సరిహద్దుల్లో మన సైనికులు చైనాతో పోరాడుతున్నారు. మరోవైపు మనం ఆ దేశం ఉత్పత్తులను కొంటున్నాం. టిక్‌టాక్ వంటి యాప్‌లను వాడుతున్నాం. మన దేశం నుంచి ఆదాయాన్ని పొంది, మన సైన్యం మీద పోరాడటానికి కావాల్సిన ఆయుధాలను చైనా తన సైనికులకు అందిస్తుంది. చైనాలో తయారైన ఫోన్‌ను నేను వదిలించుకున్నాను. ఒక సంవత్సరంలో ఆ దేశంలో తయారైన వాటిని నా జీవితం నుంచి తీసేస్తాను. మామూలుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో మనం నిద్రపోతూ, సైనికులు చూసుకుంటారులే అనుకుంటాం. కానీ ఇప్పుడు దిల్లీ, ముంబయి, బెంగళూరు, .. ఇలా అన్ని ప్రాంతాల్లోని పౌరులే చూసుకోవాలని నేను కోరుతున్నాను’ అని చెప్పడంతో పాటు ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు మరో వందమందికి అందేలా చూడాలన్నారు.

‘ఇప్పుడు చైనా ఆ దేశ ప్రజలే గురించే భయపడుతుంది. 140కోట్ల మంది ప్రజలను బానిసలుగా చూస్తుంది. వారికి ఏ హక్కులు లేవు. వారితో పనులు చేయించుకొని, ప్రభుత్వం డబ్బులు పోగేసుకుంటుంది. కరోనా వైరస్‌ తర్వాత అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఎగుమతులు తగ్గిపోయాయి. నిరుద్యోగం పెరుగుతుండటంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దాన్ని తొక్కి పెట్టడానికే చైనా చర్యలకు దిగుతుందని భావిస్తున్నాను’ అని ఆ దేశంపై విమర్శలు చేశారు. 130 కోట్ల మంది భారతీయులు చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందన్నారు. అది మన పరిశ్రమలకు ఉపకరిస్తుందని, మన కార్మికులకు పని లభిస్తుందన్నారు. కొద్ది రోజులుగా సరిహద్దుల వెంట ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించాయి. ఈ నేపథ్యంలో రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత అయిన వాంగ్‌చుక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.