ArticlesNews

నిరుపమాన దేశభక్తుడు మహారాణాప్రతాపుడు

2kviews

క్రీ.శ. 16వ శతాబ్దమునకు చెందినవాడు. రెండవ ఉదయము కుమారుడు. మహారాణా ప్రతాప్ మేవాడ్ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. విదేశీ విధర్మీయ పరిపాలనకు విరుద్ధంగా జీవన పర్యంతం సంఘర్షణ చేశారు. హిందూ ధర్మ పతాకరయైన కాషాయ పతాకాన్ని ఎల్లప్పుడు ఎత్తైన ఉన్నతశిఖరాలపై రెపరెపలాడించాడు. స్వదేశ, స్వభర్మ రక్షకుడైన రాణా ప్రతాపుడు శత్రువులపై పగ తీర్చుకోవడానికి, శత్రువుల చర్యలను ప్రతిఘటించడానికి ప్రజా చైతన్యానికి ప్రతినిధి అయ్యాడు. ఆ కాలంలో అనేకమంది హిందూ రాజులు తమ స్వాభిమానాన్ని విడిచిపెట్టి మొఘలు పాదుషాలతో సంధి ప్రయత్నాలు చేసుకుంటూ తమ కుమార్తెలనిచ్చి వివాహాలు చేసి బంధుత్వాన్ని పెంచుకుంటూ ‘దీన్ ఈ ఇలాహీ’ అనే సంస్థ ద్వారా హిందువులను భ్రమింపజేస్తుంటే ఆనాటి రాజైన మొగలు పాదుషా – అక్బర్ యొక్క కపటాన్ని, చాతుర్యాన్ని రాణా ప్రతాప్ విఫలం చేసేవాడు. మాతృభూమిని మొఘలు పాదుషాలనుండి రక్షించడానికి నడుంకట్టిన క్షాత్ర సింహం రాణా ప్రతాప్ వీరులకు, వీరమాతలకు నిలయమైన చిత్తోడు దుర్గాన్ని మ్లేచ్చులనుండి విముక్తంచేయాలని సర్వ సుఖాలను త్యజించి ఆకులలములే అన్నముగ భుజించి పోరాడిన అద్భుత దేశభకుడు.

హల్దీఘాట్ యుద్ధం ద్వారా మొఘలు సైనికులకు రాజపుత్ర వీరుల అసమాన శౌర్య పరాక్రమాలను రుచి చూపించాడు. చిత్తోడ్, మంగళ్ గఢ్ వంటి దుర్గాలను విముక్తం చేస్తానని కుమారుడు నుండి మాటపొందిన తరువాతనే ప్రాణాలు విడిచిన అమరవీరుడు.

రాణాప్రతాపుడు బాప్పారావల్ వంటి వీరపురుషులు జన్మించిన శిశోడియా వంశంలో జన్మించాడు. సాహసశౌర్యాలు అతనికి వెన్నతో పెట్టిన గుణాలు. ఇతని తండ్రి ఉదయసింహుడు. రాజపుత్రుల శ్రద్ధాకేంద్రం, పవిత్రమైన చిత్తోడుదుర్గం మొఘలుల చేతిలో నాశనమవుతుండడం చూసి రాణాప్రతాప్ సహించలేక “చిత్తోడును స్వతంత్రం చేసేవరకు నేను బంగారుపళ్ళెంలో భుజించను, మెత్తని పరుపులపై నిద్రించను, రాజభవనంలో నివసించను. ఆకులలో భుజిస్తూ, నేలపై నిద్రిస్తూ గుడారంలో జీవిస్తాను. అంతవరకు గడ్డం కూడా తీయను.” అని భీష్మప్రతిజ్ఞ చేసిన స్వాభిమాన వీరుడు. అక్బరు సైన్యాన్ని, వ్యూహాన్ని అధ్యయనం చేసి అతనిని ఎదిరించాలంటే కొండలలో, కోనలలో ఉంటూ పోరాడాలని ఆలోచన చేసిన వ్యవహారకుశలుడు కుశలుడు రాణా ప్రతాపుడు.

గిరివాసులు, వనవాసులైన భిల్లులను సైన్యంలో చేర్చుకుని రాణాప్రతాప్ వేల మంది సైనికులతో రెండు లక్షల సైన్యం కలిగిన అక్బర్ ను హల్దిఘాట్ వద్ద ప్రతిఘటించడానికి సిద్ధమైనాడు. 1576 లో జరిగిన యుద్ధంలో హల్దీఘాట్ రాజపుత్ర వీరుల రక్తంతో పావనమైంది. అక్కడే “చేతక్” (రాణాప్రతాప్ గుర్రం) జ్ఞాపకాలు కూడా అమరమైనాయి. అయినా రాణా ప్రతాపుడు మాత్రం లొంగలేదు. మహారాణా కొండలు, లోయలలో గెరిల్లా యుద్ధ వ్యూహం పాటించాలని నిశ్చయించాడు. మహారాణాకు, అనుయాయులకు ఆహార కొరత ఏర్పడి గడ్డి నుండి వచ్చే విత్తనాలతో రొట్టెలు చేసి తింటూ ఉండేవారు.

ప్రతాపుని పూర్వీకులవద్ద పనిచేసిన భామాషా మేవాడ్ సంరక్షణ కోసం సతత సంఘర్షణ చేస్తున్న రాణాప్రతాపుడికి ఇరవై అయిదు వేల మంది సైనికులను, పన్నెండు సంవత్సరాల పాటు పోషించడానికవసరమైనంత ధనరాసులను సమర్పించుకున్నాడు. “నా ధనం ధర్మకార్యంలో, దేశకార్యంలో ఉపయోగపడటమే నాకు సార్థకత” అని సమర్పించు కొన్నాడు. రాణా ప్రతాప్ పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. అయితే కష్టాలనే పర్వతాలను దాటుకుంటూ వాటి మధ్యనే దారి ఏర్పరచుకుంటూ వెళ్ళిన మహారాణా ప్రతాప్ ఉక్కు శరీరం కూడా మెత్తబడి పోయింది. అప్పటికే మేవాడ్ లో కొంత వశం చేసుకున్నాడు రాణా ప్రతాప్.

చివరి దశలో చిత్తోడ్, మంగళ ఘడ్ వంటి దుర్గాలను వశం చేసుకుంటానని కుమారుడి నుండి మాట తీసుకుని అస్తమించాడు. తలవంచని వీరునిగా చరిత్రలో నిలిచిపోయాడు.

భారతీయ చారిత్రక పురుషునిగా ప్రాతఃస్మరణీయుడైన మహారాణా ప్రతాప్ సింహుడు దేశ, ధర్మ, సంస్కృతుల రక్షణ కోసం పడిన కష్టము, స్వాభిమాన రక్షణ, స్వాతంత్ర్య సాధన కోసం చేసిన కృషి, వీరవ్రతమూ మనకు ప్రేరణకావాలి.

నేడు మహారాణా ప్రతాపుని జయంతి.

“నిత్య స్మరణీయులు” గ్రంధం నుంచి….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.