
అవినీతిలో కూరుకుపోయిన పాలకులు, ఉన్నతాధికారులు. బాధ్యత లేని ప్రభుత్వోద్యోగులు, ప్రజలు. అడుగడుగునా నిర్లక్ష్యం, నిర్వేదం, నిష్క్రియాపరత్వం ఇదీ మనకు తెలిసిన భారత దేశం. కానీ నేటి మన దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.
అవును ఈ కరోనా కల్లోల సమయంలో మన దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అవినీతి పరులు, స్వార్థపరులుగా మనం ఇప్పటివరకూ భావిస్తూ వచ్చిన రాజకీయ నేతలు నేడు ఎంతో హుందాగానూ, బాధ్యతాయుతంగానూ ప్రవర్తిస్తున్నారు. తమ రాజకీయ వైషమ్యాలను పక్కన బెట్టి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ఆకస్మికంగా వచ్చి పడిన ఈ అకాల విపత్తు నుంచి తమ ప్రజలను రక్షించుకోవడానికి అహరహమూ శ్రమిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆయా ప్రభుత్వాలకు, వాటి నిర్ణయాలకు దన్నుగా నిలుస్తున్నారు.
నిన్న ఒక్క మిత్రునికి ఫోన్ చేశాను. అతను వయసులో నాకంటే చాలా చిన్నవాడు. చాలా పేద వాడు కూడా. ఓ చిన్న ప్రైవేటు సంస్థలో మరింత చిన్న ఉద్యోగి అతను. “ఏంటబ్బాయ్ ఏం చేస్తున్నావ్?” అంటూ పలుకరించాను. ” ఏముందన్నా లాక్ డౌన్ వేళ ఖాళీగా ఉండడం ఎందుకని మాస్కులు కుట్టి అన్ని చోట్లకీ పంపుతున్నాను. నిన్ననే నెల్లూరుకి ఓ వంద మాస్కులు పంపాను.” అన్నాడు ఆ కుర్రవాడు. “మరి నీ జరుగుబాటెలా? జీతమొస్తోందా? ” అంటూ ఉత్సుకతగా ప్రశ్నించానతన్ని. “ఈ టైంలో జీతమెలా వస్తుందన్నా? ఏదో ఉన్నదాంతోనే నడిచిపోతోంది.” అన్నాడు. తమాషా చూడండి. అతనికి తన కుటుంబం ఎలా గడుస్తుందన్న చింత లేదు. కానీ తన చుట్టూ ఉన్న వారందరూ బాగుండాలనే తపన ఉంది. అందుకే తనకు రూపాయి ఎలాగా? అనే ఆలోచన లేకుండా పదుగురికీ ఉపయోగపడే మాస్కుల తయారీలో నిమగ్నమయ్యాడు.
అంతటితో అయిపోయిందా? ఎర్రటి ఎండలో నిలబడి తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్న పోలీసు వాళ్ళను చూసి “అయ్యో బిడ్డలు ఎండకు మాడి పోతున్నారు కదా?” అనుకుంటూ కూల్ డ్రింక్ బాటిళ్ళతో వాళ్ల దగ్గరకు వెళ్లి వాళ్ల దాహం తీర్చే ప్రయత్నం చేసింది ఓ తల్లి.
సాధారణ కుటుంబం. తాను ఏడెనిమిది వేల జీతానికి ఒక సేవా సంస్థలో పనిచేస్తుంది. కరోనా విపత్తు సాయంగా ప్రభుత్వం తనకందించిన వెయ్యి రూపాయల మొత్తాన్ని మరో నిరుపేద కుటుంబానికి అందించి తన దాతృత్వాన్ని చాటింది మరో తల్లి.
నిండు గర్భిణి. అత్యంత అనారోగ్య పరిస్థితుల మధ్య కూడా తను పనిచేసే వైరాలజీ ల్యాబ్ లో రోజుల తరబడి శ్రమించి కరోనా నిర్ధారణ కిట్లను తయారుచేసింది ఇంకో తల్లి.
తన నెలల బిడ్డను ఇంట్లోనే వదిలి ఈ అత్యవసర పరిస్థితులలో డ్యూటీకి హాజరై అవిశ్రాంతంగా పని చేసింది మరో తల్లి.
తన కొడుకు తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు ఆ ప్రాంతంలోని ప్రజలు ఎవరూ కరోనా బారిన పడకుండా రహదారిపై కాపు కాస్తున్నాడో సాధారణ కానిస్టేబుల్.
కరోనా బాధితుల సేవలో నిమగ్నమైన కారణంగా తాను కూడా కరోనా బారినపడి మృతి చెందిందో మహిళా డాక్టర్.
ఇలాంటి సంఘటనలు ఎన్నో తమ కళ్ల ముందు జరుగుతూ ఉన్నా, వందల సంఖ్యలో వైద్య సిబ్బంది క్వారంటైన్ లోకి వెళుతూ ఉన్నా ఏ మాత్రం వెనుకంజ వేయకుండా తమ సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు వైద్య సిబ్బంది.
అక్కడక్కడా తమ తుంటరి చర్యలతో కొంతమంది తమను విసిగిస్తూ ఉన్నా ఎంతో సహనంతో తమ ప్రాణాలకు తెగించి తమ విధులను నిర్వహిస్తున్నారు పోలీసులు.
తాము కూడా కరోనా రక్కసి బారిన పడే అవకాశం ఉన్నదని తెలిసి కూడా నగరాలు, పల్లెలు, పట్టణాలను శుభ్రం చేసే గురుతర బాధ్యతను నిర్వహిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు.
వీటన్నిటినీ మించి లాక్ డౌన్ కారణంగా తమ చుట్టూ ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వాలకు అడుగడుగునా సహకరిస్తూ గడప దాటి బయటకు రాకుండా అజ్ఞాత వాసాన్ని పాటిస్తున్నారు ప్రజలు.
అంతేకాదు ఎందరో సామాన్యులు తమ చుట్టూ ఉన్నవారి బాధలను గుర్తించి వారికి చేతనైనంత సాయం చేస్తున్నారు. పోలీసువారికి, పారిశుద్ధ్య సిబ్బందికి మంచినీళ్లు, తేనీరు, అల్పాహారం, భోజనం వంటివి అందిస్తున్నారు. తమ పరిసరాలను శుభ్రం చేసి తాము కరోనా రక్కసి బారిన పడకుండా కాచుకుంటున్న పారిశుద్ధ్య సిబ్బంది పాదాలను భక్తితో కడిగి, వారిని పుష్ప మాలలతో, నూతన వస్త్రాలతో సత్కరించుకుంటున్న మన దేశ ప్రజల సంస్కారానికి నేను తలవంచి నమస్కరించకుండా ఉండలేను.
తెనాలిలో ఒక సామాన్య వైదిక బ్రాహ్మణ కుటుంబం. ఆ ఇంటిలోని నలుగురు కుటుంబ సభ్యులు ప్రతిరోజూ సాంప్రదాయ పద్ధతిలో వంట చేసి ఆ పదార్థాలను నగరంలోని పేద వాడలలోని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఆ పనిని వారు భగవంతుని సేవగా, పవిత్ర కార్యంగా భావించి కొనసాగిస్తున్నారు.
ఇలా ఒక్కరనేమి వివిధ రాజకీయ పక్షాలు, సేవా భారతి, జన సంక్షేమ సమితి వంటి వివిధ సేవా సంస్థలు, వివిధ నగరాలలోని స్థానిక సేవా సంస్థలు, వివిధ యూనియన్లు ఇలా అడుగడుగునా అవసరమైనవారికి నిత్యావసర వస్తువులు, భోజనాలు, మాస్కులు, కూరగాయలు, పండ్లు తదితరాలు అందిస్తూనే ఉన్నారు.
సామాన్య ప్రజల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తోపాటు ప్రతిపక్ష, అధికారపక్ష నాయకులు నిరంతరం కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించడం, సమీక్షించడం, కరోనా అనుమానితులను క్వారంటైన్ కు తరలించడం, ప్రజలకు ఎప్పటికప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించడం, హెచ్చరించడం ఇలా తమ బాధ్యతల నిర్వహణలో అహరహమూ శ్రమిస్తున్న పరిస్థితి మనకు గోచరిస్తుంది. సామాన్యుల దగ్గర నుంచి అత్యున్నత అధికారులు, నాయకుల వరకూ నిబద్ధత కనిపిస్తోంది. నిజానికి ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఏ జాతినైనా విజేతగా నిలుపగలిగేది ఇలాంటి ఏకాత్మత మాత్రమే.
ఇన్నాళ్ళూ మేధావుల ప్రసంగాలలో రచనలలో “మన దేశం అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నది, అడుగడుగునా అవినీతి, నిర్లక్ష్యం, నైరాశ్యం అలుముకుని ఉన్నది” అని వినబడుతూ, కనబడుతూ ఉండింది. కానీ మనకన్నా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలుగా శ్లాఘింపబడుతూ ఉన్న ఎన్నో దేశాల కంటే మన దేశం నేడు మిన్నగా నిలిచింది. ఇప్పటికైనా కళ్లు తెరవండి మేధావులారా. మన దేశం….. నా దేశం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ విశ్వమానవాళికి మార్గదర్శి, జగద్గురువు, జగదైక గురువు. భారత్ మాతాకీ జయ్.





