
హైదరాబాదులోని ఆనంద్ నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వేణు కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు హాజరైన మాజిద్, సాదిక్ బిన్ సలాం, అబ్దుల్ ఖాదీన్, అహ్మద్, షేక్ ఖాసీం లు తాము పాడె మోస్తున్నట్టుగా ఉన్న కొన్ని దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. అవే దృశ్యాలను మీడియాకు కూడా పంపారు. ఇంకేముంది మత సామరస్యం ఫరిడవిల్లుతోందంటూ మీడియా హోరెత్తించింది.
తాజాగా ఈ ఉదంతంపై మృతుని కుమారుడు సచిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి పాడె మోసిన ఆ ఐదుగురూ అంత్యక్రియల తతంగమంతా తామే నిర్వహించినట్లుగా సోషల్ మీడియాలో జరిపిన ప్రచారమంతా శుద్ధ అబద్ధమని, వారు చేసిన తప్పుడు ప్రచారంతో తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సచిన్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అంత్యక్రియలకు సహకరించడానికి తమ బస్తీవాసులు మొదట్లో కొంత నిరాకరించినా, పోలీసుల జోక్యం అనంతరం ఎంతో చక్కగా తమకు సహకరించారని, తమ బంధు వర్గం కూడా అన్ని విషయాలలో తమకు చేదోడువాదోడుగా నిలిచారని, సదరు ముస్లిములు చేసిన అసత్య ప్రచారం కారణంగా ఇప్పుడు తమ బంధువులందరూ తమను వారెవరంటూ ప్రశ్నిస్తున్నారని సచిన్ పేర్కొన్నాడు. రెండేళ్ళ క్రితమే తల్లిని కోల్పోయి కష్టాల్లో వున్న తాము తాజాగా తండ్రిని కూడా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉంటే ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాకం తమను మరింత క్షోభకు గురిచేస్తున్నదని సచిన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు అతను ఒక వీడియో కూడా విడుదల చేశాడు.





