
త్రిప్పునితురలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ ఘోష్ ప్రదర్శన అత్యంత క్రమశిక్షణ, ఖచ్చితత్వం సంగీత ప్రతిభ ఆకట్టుకుందని ప్రముఖ సంగీత దర్శకుడు జెర్రీ అమల్దేవ్ ప్రశంసించారు. భారతదేశంలో ఇంతటి క్రమశిక్షణ, ఖచ్చితత్వం, పరిపూర్ణతతో కూడిన సంగీత కార్యక్రమాన్ని చూడటం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. త్రిప్పునితురలోని శ్రీ వేంకటేశ్వర పాఠశాలలో ఆర్ఎస్ఎస్ ఎర్నాకుళం విభాగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఘోష్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. సాధారణ సంగీత కార్యక్రమాల్లో కనిపించే క్రమశిక్షణ లోపానికి భిన్నంగా ఈ కార్యక్రమం సరికొత్త అనుభూతిని ఇచ్చిందని తెలిపారు.
ఘోష్ వాయిద్యాలను ఉపయోగిస్తూ, మోహనం వంటి శాస్త్రీయ రాగాలను మార్చింగ్ శైలిలో ఎంతో సమన్వయంతో ప్రదర్శించడాన్ని అమల్దేవ్ కొనియాడారు. విదేశాల్లో కనిపించే పౌర క్రమశిక్షణ, పరస్పర గౌరవాన్ని మన సమాజంలోనూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మరియు ప్రయాణాల సమయంలో పెద్దలు, మహిళల పట్ల ధోరణిలో మార్పు రావాలని ఆయన నొక్కిచెప్పారు. సామాజిక సంస్కరణ, ప్రజాచైతన్యం లక్ష్యంగా చేపట్టే ఇలాంటి కార్యక్రమాలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బౌద్ధిక్ ప్రసంగం చేసిన ఆర్ఎస్ఎస్ దక్షిణ క్షేత్ర ప్రచారక్ ప్రముఖ్ వి. ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ, “నా జీవితం, నా స్వేచ్ఛ” అనే ధోరణితో నేటి యువత కేవలం భౌతిక సుఖాలకే ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, “తన ఆనందం కోసం చేసే పని ఇతరులకు కూడా ఆనందాన్ని కలిగించాలి” అనే భారతీయ తత్వంతో సమాజం ముందుకు సాగాలని అన్నారు. ప్రకృతిలోని ఇతర జీవుల మాదిరిగా కాకుండా మనిషి పుట్టుక నుండి మరణం వరకు సమాజం, పర్యావరణంపై ఆధారపడి ఉంటాడని, అందువల్ల సమాజం పట్ల ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా ఇతరుల కన్నీళ్లు తుడవడంలోనే, అందరి మేలు కోసం శ్రమించడంలోనే అసలైన ఆనందం దాగి ఉందని చెప్పారు. మాదకద్రవ్యాల వ్యసనానికి ప్రజలు బానిసవుతున్న నేటి కాలంలో, లయ, రాగం, క్రమశిక్షణ కలగలిసే జాతీయ సేవ, సంగీతం వంటి “సృజనాత్మక మత్తు” వైపు సమాజాన్ని నడిపించడమే సంఘ్ లక్ష్యమని వివరించారు.
కార్యక్రమంలో భాగంగా శ్రీ వేంకటేశ్వర పాఠశాల నుండి ప్రారంభమైన ఘోష్ సంచలన్ నగర వీధుల గుండా ఊరేగింపుగా సాగి తిరిగి పాఠశాల ప్రాంగణంలో ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఎర్నాకుళం విభాగ్ కార్యవాహ్ కె.సి. బిజుమోన్ స్వాగతోపన్యాసం చేయగా, విభాగ్ సహసంఘచాలక్ పి. శివదాస్ తదితరులు పాల్గొన్నారు.





