అమెరికాలో రోజురోజుకీ వైరస్ వ్యాప్తి ఉద్ధృతమవుతుండడం ఆ దేశ ప్రజల్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. శ్వేతసౌధం యంత్రాంగమంతా వైరస్‌ను కట్టడి చేయడంలోనే నిమగ్నమైంది. అయినా ఆశాజనక ఫలితాలు రావడం లేదు. పైగా రానున్న రోజుల్లో మరిన్ని విపత్కర పరిస్థితులు ఎదురుకాబోతున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ కాస్త అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. తొలినాళ్లలో వైరస్ గురించి సరైన రీతిలో హెచ్చరించడంలో విఫలమైన సంస్థలు, వ్యక్తుల పట్ల చర్యలకు ఉపక్రమించారు.
డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల నిలిపివేత…
తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు అమెరికా నుంచి ఇవ్వాల్సిన నిధుల్ని నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అంతటితో ఆగకుండా సంస్థపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. డబ్ల్యూహెచ్‌ఓ చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. వైరస్ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో దాని ప్రమాదంపై సంస్థ వద్ద సమాచారం ఉందని.. అయినా పంచుకోవడానికి ఇష్టపడలేదని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి విషయంలో చాలా తప్పటడుగులు వేసిందని విమర్శించారు. చైనాలో కొవిడ్-19 విజృంభణ కొనసాగుతున్న సమయంలో అమెరికా ఆ దేశ ప్రయాణాలపై నిషేధం విధిస్తే డబ్ల్యూహెచ్‌ఓ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఇది అతిపెద్ద తప్పుడు నిర్ణయమని అభిప్రాయపడ్డారు.
డబ్ల్యూహెచ్‌ఓపై స్వతంత్ర దర్యాప్తు…
మరోవైపు కొవిడ్-19పై డబ్ల్యూహెచ్‌ఓ స్పందిస్తున్న తీరుపై సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటీ ఛైర్మన్ జిమ్ రిష్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో డబ్య్లూహెచ్‌ఓపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు. ”ఒక్క అమెరికానేగాక ప్రపంచదేశాల్ని సంస్థ తప్పుదారి పట్టించింది” అని రిష్ ఆరోపించారు. అమెరికా పౌరులు కట్టే పన్నుల ద్వారా వచ్చిన నిధుల్ని వేల మంది ప్రాణాల్ని ప్రమాదంలో పడేసిన నిర్లక్ష్యపు సంస్థకు కట్టబెట్టలేమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు టెడ్రోస్ అధనోమ్ డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌గా రాజీనామా చేసే వరకు నిధుల్ని నిలిపివేయాలని కోరుతూ అమెరికాలో ఉభయపక్షాలకు చెందిన 24 మంది సభ్యులతో కూడిన చట్టసభల ప్రతినిధుల బృందం తీర్మానించింది.
తాత్కాలిక నేవీ సెక్రటరీ రాజీనామా…
మరోవైపు కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన 2.2 ట్రిలియన్ డాలర్ల నిధిని పర్యవేక్షిస్తున్న ఇన్‌స్పెక్టర్ జనరల్‌ని ట్రంప్ విధుల నుంచి తొలగించారు. ఆస్పత్రుల్ని అప్రమత్తం చేయడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ట్రంప్ అభిశంసనను సమర్థించిన వారిలో ఈయన కూడా ఉండడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. అలాగే అమెరికా నావికాదళ తాత్కాలిక సెక్రటరీగా ఉన్న థామస్ మోడ్లీ సైతం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. విమానవాహక నౌక యూఎస్‌ఎస్ థియోడొర్ రూజ్‌వెల్ట్‌లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఆ నౌకకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కమాండర్ బ్రెట్ క్రోజియర్ కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.