News

సింహస్థ కుంభమేళాలో మద్యం, మాంసం విక్రయాలపై సాధువుల అభ్యంతరం!

32views

నాసిక్: నాసిక్‌లో జరగనున్న సింహస్థ కుంభమేళా ఏర్పాట్లపై సాధువులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళాకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ సన్నాహాలు నత్తనడకన సాగుతున్నాయని, సాధువుల కోసం కేటాయించిన సాధుగ్రామాన్ని ఇప్పటికీ అప్పగించకపోవడం ఆందోళన కలిగిస్తోందని శ్రీ పంచ నిర్వాణి ఆని అఖాడాకు చెందిన మహంత్ మురళీదాస్ మహారాజ్ పేర్కొన్నారు.

రామ్‌కుండ్ ప్రాంతంలో జరుగుతున్న కుంభమేళా ఏర్పాట్లను సంతులు, మహంతుల బృందం పరిశీలించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మహంత్ మురళీదాస్ మహారాజ్ మాట్లాడుతూ.. కుంభమేళాకు కేవలం 8-9 నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఏర్పాట్లు జరగలేదన్నారు. సాధువులు, సన్యాసుల నివాసం కోసం ఉద్దేశించిన సాధుగ్రామాన్ని ఇప్పటికే సిద్ధం చేసి వారికి అప్పగించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సాధువుల కోసం తక్షణమే విశాలమైన స్థలాన్ని కేటాయించి అవసరమైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

కుంభమేళా ప్రాంగణంలో మద్యం, మాంసం విక్రయాలా?

కుంభమేళా నిర్వహించే ప్రాంగణాలు అత్యంత పవిత్రమైనవని, అలాంటి ప్రాంతాల్లో మద్యం, మాంసం విక్రయించే దుకాణాలు కొనసాగడం సాధువుల సంప్రదాయాలు, సూత్రాలకు విరుద్ధమని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కుంభమేళా పవిత్రతను కాపాడేందుకు ఇలాంటి దుకాణాలను వెంటనే తొలగించాలని సూచించారు.

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా ఏర్పాట్లను ఉదహరిస్తూ.. అక్కడ ముందుగానే అన్ని సన్నాహాలు పూర్తి చేయడం వల్లే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించగలిగారని పేర్కొన్నారు. నాసిక్‌లోనూ అదే తరహాలో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.

ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే నాసిక్ సింహస్థ కుంభమేళాలో పాల్గొనాలా వద్దా అనే విషయాన్ని కూడా పునరాలోచించుకోవాల్సి వస్తుందని మహంత్ మురళీదాస్ మహారాజ్ హెచ్చరించారు.

కుంభమేళా సమీపిస్తున్న నేపథ్యంలో సాధువుల అభ్యంతరాలు, డిమాండ్లపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.